గన్నవరం వైసీపీలో మళ్లీ భగ్గుమన్న విభేదాలు... వల్లభనేని ఆఫీసు వద్ద వంశీ- యార్లగడ్డ వర్గాల ఘర్షణ
గన్నవరం వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు చోటు చేసుకున్నాయి. వరలక్ష్మీ వ్రతం వేళ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గాలు ఘర్షణ పడ్డాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
గన్నవరం వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ , యార్లగడ్డ వెంకట్రావు వర్గాలు బాహాబాహీ తలపడ్డాయి. ఇరువర్గాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రభల వేడుకల ఊరేగింపులో వివాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వల్లభనేని వంశీ ఆఫీసు ఎదురుగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే యార్లగడ్డ వర్గీయులే దాడి చేశారని వంశీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. తమను కవ్విస్తూ గొడవకు దిగారని చెబుతున్నారు. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి భారీగా చేరుకుంటున్నారు.
కాగా... టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ మోహన్ వైఎస్ఆర్‌సీపీలో చేరడాన్ని యార్లగడ్డ వెంకట్రావుతో పాటు అతని అనుచర వర్గం ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. వారిలో నెలకొన్న అసమ్మతిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. యార్లగడ్డ ముందు ఉండే.. వంశీతో కలిసి పనిచేసేది లేదని బాహాటంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గన్నవరం అధికార వైసీపీలో వర్గపోరు రోజు రోజుకీ ముదురుతోంది.
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ను టార్గెట్ చేస్తూ.. యార్లగడ్డ వెంకట్రావు విమర్శలు గుప్పించారు. దానికి కౌంటర్ గా వల్లభనేని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ నుండి తనకు టికెట్ తప్పకుండా వస్తుందన్న యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యలకు వల్లభనేని వంశీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
గన్నవరం ప్రజలు తనను ఆశీర్వదించారని, వాళ్లకి ఏ ఇబ్బంది వచ్చిన తను పరిష్కరిస్తానని. తనను పని చేయమని సీఎం జగన్ చెప్పారని మరోసారి పునరుద్ఘాటించారు. ఒకవేళ ఈ విషయంలో యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావుకి బాధ ఉంటే సీఎంను కలవాలని అన్నారు. అంతేకానీ, ఇలాంటి మాటలు మాట్లాడం సరికాదని హితవు పలికారు. తనకు సీఎం జగన్ మద్దతు ఉందన్నారు. దారిని వచ్చేపోయే వారి గురించి పట్టించుకోని అన్నారు. ఎవరికి సీటు ఇవ్వాలో.. సీఎం జగన్ కు చాలా బాగా తెలుసునని, ఆయనే నిర్ణయిస్తారన్నారు. మట్టి తవ్వకాలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు.