Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు: వినాయక నిమజ్జనంలో రాజకీయం... రాళ్లు, కర్రలతో కొట్టుకున్న వైసిపి, టిడిపి శ్రేణులు (వీడియో)

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలో వినాయక నిమజ్జన ఉత్సవం ఉద్రిక్తతకు దారితీసింది. టిడిపి, వైసిపి శ్రేణులు పరస్పరం రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు.

Clash Between TDP and YCP Leaders in Ganesh Idol Immersion at guntur
Author
Guntur, First Published Sep 21, 2021, 1:02 PM IST

గుంటూరు: వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన ఊరేగింపు రాజకీయ రంగు పులుముకుంది. ఊరేగింపు సందర్భంగా అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగి పరస్పరం రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులు చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ దాడిలో ఇద్దరు తీవ్రగాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. 

వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలో సోమవారం వినాయక నిమజ్జనం జరిగింది. ఇందులోభాగంగా వినాయక విగ్రహాన్ని గ్రామంలో ఊరేగిస్తూ తీసుకునివెళుతుండగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఊరేగింపులో పాల్గొన్న వైసిపి, టిడిపి కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగి చివరికి కర్రలు, రాళ్ళతో పరస్పరం కొట్టుకునే స్థాయికి చేరింది. 

వీడియో

ఈ ఘర్షణ పరస్పర దాడులతోనే ఆగలేదు. కోపంతో రగిలిపోయిన వైసిపి శ్రేణులు టిడిపి మాజీ ఎంపిటిసి వేణు ఇంట్లోకి బలవంతంగా చొరబడి అడ్డం వచ్చినవారిని చితకబాదారు. అంతేకాకుండా ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి నిప్పంటించారు. దీంతో పర్నీచర్ సహా ఇల్లు కాలిపోయింది. 

ఊరేగింపు సందర్భంగా బందోబస్తు కోసం వచ్చిన పోలీసుల ఎదుటే ఈ బీభత్సమంతా జరిగింది. వారు పరిస్థితిని అదుపుచేయాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఇరు వర్గాల పరస్పర దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని పోలీసులు అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా వుండటంతో పోలీస్ బలగాలను మొహరించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios