స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో అధికార ప్రతిపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బుధవారం గుంటూరు జిల్లా నరసరావుపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

పాలపాడు ఎంపీటీసీ అభ్యర్ధి రామిరెడ్డిని అడ్డుకున్న వైసీపీ శ్రేణులు నామినేషన్ పత్రాలను చించేశాయి. ఈ ఘటనపై స్ధానిక ఆర్డీవోకు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేత అరవింద్ అక్కడికి రావడంతో ఆయనను కూడా అడ్డుకున్నారు.

Also Read:చంపేస్తారా, డీజీపీ సమాధానం చెప్పాలి: మాచర్ల ఘటనపై బాబు ఆగ్రహం

అటు పల్నాడు ప్రాంతంలోని కారంపూడిలోనూ ఉద్రిక్తత నెలకొంది. తమను నామినేషన్లు వేయనివ్వకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయానికి టీడీపీ, వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి.

అంతకుముందు మాచర్లలో టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న తదితరులు బుధవారం మాచర్లలో పర్యటించారు. ఆ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు మోటారు సైకిళ్లపై వెంబడించి కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు.

డ్రైవర్ సమయ స్పూర్తితో వ్యవహరించి కారును వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో ఆ దాడి నుంచి బుద్ధా తృటిలో తప్పించుకున్నారు. అయితే న్యాయవాది కిశోర్ తలకు గాయాలయ్యాయి. తీవ్రగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read:మాచర్లలో బొండా, బుద్దా వెంకన్న కారుపై వైసీపీ దాడి: ఉద్రిక్తత

దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, వైసీపీ కార్యకర్తల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు లేనేలేవని, పులివెందులలో పోలీసులే నామినేషన్లు వేయనివ్వడం లేదని చంద్రబాబు మండిపడ్డారు.