మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ గురించి ఎంత మాట్లాడిన తక్కువేనని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ అన్నారు. ఆయన ఓ సమగ్ర సమతామూర్తి అని కొనియాడారు. 

మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ గురించి ఎంత మాట్లాడిన తక్కువేనని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ అన్నారు. ఆయన ఓ సమగ్ర సమతామూర్తి అని కొనియాడారు. రైతు బిడ్డగా, రంగస్థల నటుడిగా, కథనాయకుడిగా, రాజకీయనాయకుడిగా ఆయన ఎదిగారని గుర్తుచేశారు. గురువారం తిరుపతిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 
ఎన్టీఆర్ గురించి సంపూర్ణ ఆవిష్కరణ చేయడం సాధ్యం కాదన్నారు. ఆయన వ్యక్తిత్వం ఒక్క రోజులో రూపొదిద్దుకోలేదని చెప్పారు. ప్రజలకు విశేష సేవలందించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే నిర్విరామ కృషితో అధికారంలో వచ్చారని గుర్తుచేశారు. 

రాజకీయ పార్టీకి సిద్దాంతం, క్రమశిక్షణ ఉండాలని భావించిన మహానీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. కాలేజ్‌లో చదివే రోజుల్లో ఎన్టీఆర్‌ను అభిమానించేవాడినని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. 1983లో ఆయన కోసం పరోక్షంగా పనిచేశానని తెలిపారు. 1989లో ఎన్టీఆర్‌తో చాలా సమయం గడిపాని చెప్పారు. ఎన్టీఆర్ మనిషిగా తనపై ముద్ర వేశారని చెప్పారు. ఆయన మనిషిగా ఉండటాన్ని గర్విస్తున్నానని తెలిపారు. పదవీ విరమణ తర్వాత ఎన్టీఆర్‌పై పుస్తకం రాస్తానని చెప్పారు. స్వలాభం కోసం కాకుండా ప్రజా సేవ కోసం పార్టీ పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. 

అంతకుముందు తిరుపతిలో రెండు స్పెషల్ కోర్టులను జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఇతర న్యాయాధికారులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ రెండు కోర్టులు కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల విచారణకు ఉద్దేశించబడినవి.

ఇక, గురువారం రాత్రి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తిరుమలకు చేరుకోనున్నారు. ఈ రాత్రికి ఆయన అక్కడే బస చేయనున్నారు. శుక్రవారం తెల్లవారుజామును జస్టిస్ ఎన్వీ రమణ.. తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.