రాజకీయాల్లో రాణించిన జమున: ఇందిరాపై అభిమానంతో కాంగ్రెస్‌లోకి
రాజకీయాల్లో కూడా ప్రముఖ సినీ నటి జమున రాణించారు. మంగళగిరి అసెంబ్లీతో పాటు రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుండి జమున పోటీ చేశారు. ఒక్క సారి పార్లమెంట్ కు ఆమె ఎన్నికయ్యారు
హైదరాబాద్:సినీ రంగంలోనే కాదు రాజకీయాల్లో కూడా ప్రముఖ సినీ నటి జమున రాణించారు. 1980వ దశకంలో జమున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున ఆమె ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీపై అభిమానంతో జమున రాజకీయాల్లోకి వచ్చారు. ఈ అభిమానం కారణంగానే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా చెబుతారు..1985 లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుండి జమున కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు విజయం సాధించారు.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుండి 1989 ఎన్నికల్లో జమున కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి అప్పటి టీడీపీ అభ్యర్ధి శ్రీహరిపై విజయం సాధించారు. రెండేళ్ల లోనే పార్లమెంట్ కు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. దీంతో 1991 ఎన్నికల్లో మరోసారి ఆమె రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో జమున టీడీపీ అభ్యర్ధి కేవీఆర్ చౌదరి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో జమున బీజేపీ తరపున ప్రచారం నిర్వహించారు. 1991లో రాజమండ్రి నుండి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత రాజకీయాలకు ఆమె దూరంగా ఉన్నారు
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పలువురు సినీ రంగానికి చెందిన ప్రముఖులు కాంగ్రెస్, టీడీపీ తరపున చట్ట సభలకు ఎన్నికయ్యారు. టీడీపీ తరపున శారద, రామానాయుడు , కాంగ్రెస్ పార్టీ తరపున కృష్ణ, బీజేపీ నుండి కృష్ణంరాజు తదితరులు చట్ట సభలకు ఎన్నికయ్యారు. ప్రజానాట్య మండలి వ్యవస్థాపకులు గరికపాటి రాజారావు నేతృత్వంలో నిర్వహించే ఆమె నాటకాలు ఆడేవారు. ఇలా నాటకాల్లో నటించడం ఆమెకు సినిమాల్లో ప్రవేశానికి అవకాశం దక్కింది.