అమరావతి: ఏ రాష్ట్రంలోనైనా నూతన ముఖ్యమంత్రిని ఆ రాష్ట్ర సినీ పరిశ్రమ కలవడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే ముందో లేకపోతే ప్రమాణ స్వీకారం చేయక ముందో సినీ పరిశ్రమ ఆ  రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు చెప్పడం సహజం. 

అంతేకాదు ప్రభుత్వంలో వారి కోసం ప్రత్యేకంగా సినిమాటోగ్రఫి అనే ఒక శాఖ కూడా ఉంటుంది. అలాగే సినీ పరిశ్రమకు ఆ రాష్ట్రాల ప్రభుత్వాలకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. సినిమా షూటింగ్ దగ్గర నుంచి విడుదలయ్యే వరకు ప్రభుత్వంతో ఎక్కడో ఒకచోట ప్రభుత్వంతో ముడిపడే అంశం తప్పక ఉంటుంది. 

అటు అధికారంలోకి వచ్చిన ఏ ముఖ్యమంత్రి అయినా కూడా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖలను కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తారు. వీలున్నంత వరకు పదవులను సైతం కట్టబెడుతుంటారు. దక్షిణాది రాష్ట్రాల్లో అయితే ఇది మరీ ఎక్కువ. 

అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ఎన్నికైనప్పుడు టాలీవుడ్ నుంచి ప్రముఖులు ఎవరూ అభినందించడానికి రాలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల ప్రచారంలో వైసీపీ తరపున ప్రచారం చేపట్టిన సినీనటుడు పృథ్వీరాజ్ మినహా. 

ఆ తర్వాత వైసీపీకి మద్దతు ప్రకటించిన పోసాని కృష్ణమురళితోపాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు విష్ణు కలిశారే తప్ప ఇతరులెవరు కలవలేదు. ఇకపోతే సినీ పరిశ్రమకు చెందిన పృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి కట్టబెట్టగా, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి టీటీడీ పాలకమండలిలో సభ్యుడిగా నియమించింది ప్రభుత్వం. 

ఇకపోతే కీలక పదవులు సైతం భర్తీ చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ఎన్నికవ్వడాన్ని తెలుగు సినీపరిశ్రమలోని కొందరు పెద్దలకు ఇష్టం లేదని పృథ్వీరాజ్ పలు బహిరంగ వేదికలపై సంచలన ఆరోపణలు చేశారు. 

2014 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు తెలుగు సినీపరిశ్రమ నుంచి పలువురు ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు తరలివచ్చి మరీ అభినందనలు తెలిపారని కానీ జగన్ విషయంలో అలా జరగలేదని వాదించారు. 

పృథ్వీరాజ్ ఆరోపణలు తెలుగు సినీపరిశ్రమను కుదిపేశాయి. పృథ్వీ వ్యాఖ్యలను నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీతోపాటు పలువురు ఖండించారు. అయినప్పటికీ పృథ్వీ విమర్శిస్తూనే ఉన్నారు. 

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీపెద్దలు తమ తీరు మార్చుకున్నట్లు ఉన్నారేమో ఒక్కొక్కరిగా జగన్ తో భేటీ అయ్యేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. ఇటీవలే మాజీ కేంద్రమంత్రి మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా సీఎం జగన్ ను కలిశారు. 

సీఎం జగన్ చిరంజీవి దంపతులకు విందు ఇచ్చారు. సుమారు గంటపాటు ఇరువురు చర్చించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రాన్ని చూడాలంటూ చిరంజీవి జగన్ ను కోరారు. ఇరువురు ఒకరినొకరు సన్మానించుకున్నారు. చిరంజీవి భార్య సురేఖ సీఎం జగన్  భార్య వైయస్ భారతీరెడ్డికి చీర బహుకరించారు. 

ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సీఎం వైయస్ జగన్ తో భేటీ కాగా శుక్రవారం సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ జగన్ సతీమణి వైయస్ భారతితో భేటీ అయ్యారు. మహేశ్ బాబు దత్తత తీసుకున్న గుంటూరు జిల్లా బుర్రిపాలెంపై చర్చించారు. 

బుర్రిపాలెంలో మహేశ్ బాబు ట్రస్ట్ తరపున తాము చేస్తున్న పనులపై చర్చించారు. దత్తత గ్రామమైన బుర్రిపాలెంకు ప్రభుత్వం తరపు నుంచి కూడా సహకరించాలని వైయస్ భారతిని కోరారు. ఇరువురు అరగంటకు పైగా చర్చించుకున్నారు. 

ఒక్కొక్కరుగా సినీ పరిశ్రమకు చెందిన నటులు సీఎం జగన్ ను కలుస్తుండటంతో రాబోయే రోజుల్లో సినీపరిశ్రమ ఏపీ ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు నెలకొంటాయని అంతా భావిస్తున్నారు. మెగాస్టార్, సూపర్ స్టార్ తర్వాత ఇక క్యూ కడతారని ప్రచారం జరుగుతుంది.