తిరుపతి: ప్రముఖ తెలుగు సినీ నటుడు మోహన్ బాబు పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయన ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సమస్యలపై ఆయన శుక్రవారం ర్యాలీని తలపెట్టారు. దీంతో ఆయనను హౌస్ అరెస్టు చేశారు. 

శుక్రవారం ఉదయం 10 గంటలకు శ్రీవిద్యా నికేతన్ నుంచి తిరుపతి వరకు వేలాది మంది విద్యార్థులతో మోహన్ బాబు నిరసన ర్యాలీని తలపెట్టారు. ఫీజు రీయంబర్స్ మెంట్ ను ప్రభుత్వం విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆయన ఈ ర్యాలీని తలపెట్టారు.

మోహన్ బాబు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే, తాను ర్యాలీని చేపట్టి తీరుతానని మోహన్ అంటున్నారు. ఈ స్థితిలో ఆయనను పోలీసులు హౌస్ అరెస్టు చేసి, ఆయన ఇంటిని చుట్టుముట్టారు.

ప్రభుత్వం ఫీజు రియంబర్స్ మెంట్ ను విడుదల చేయకపోవడంపై గతంలో మోహన్ బాబు తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వకపోతే విద్యాసంస్థను నడపడం ఎలా అని అడిగారు.