ఇచ్ఛాపురం: ఆంధప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇంటికకి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సినీనటుడు, వైసీపీనేత పృథ్వీరాజ్ అభిప్రాయపడ్డారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగింపు వేడుకలో పాల్గొనేందుకు ఇచ్చాపురం చేరుకున్న ఆయన చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. 

జగన్ పాదయాత్ర విజయవంతం కావడానికి ప్రజల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యమే కారణమని అభిప్రాయపడ్డారు. తమ సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వాన్ని ఓటుతో సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో పాదయాత్రలో పాల్గొన్నారని తెలిపారు. 

సమస్యలు తీర్చే ప్రజా నాయకుడు తమ ముందుకు వచ్చాడన్న నమ్మకం ప్రజల్లో వచ్చిందన్న విషయం తెలుస్తోందన్నారు. మహానేత వైఎస్సార్‌ లేని లోటు తీరుస్తారన్న భరోసా జనానికి కలిగిందని వ్యాఖ్యానించారు. ప్రజాసంకల్పయాత్రలో లక్షలాది మంది స్వచ్ఛందంగా ప్రతిరోజు జగన్‌ వెంట నడిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశ చరిత్రలో ఏ కుటుంబం కూడా వైఎస్సార్‌ కుటుంబంలా పాదయాత్ర చేయలేదని పృథ్విరాజ్ అభిప్రాయపడ్డారు. 

మరోవైపు తెలుగుదేశం పాలనపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని సినీనటుడు కృష్ణుడు అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజలంతా జగన్‌ వెంటే ఉన్నారని ఆయన అభి​ప్రాయపడ్డారు. 

పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ ఎక్కడకు వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను జగన్ వద్ద ఏకరువు పెట్టుకుంటున్నారన్నారు. ప్రజాసంకల్పయాత్రతో వైఎస్ జగన్‌ పరిపూర్ణమైన నాయకుడిగా ఎదిగారని ప్రశంసించారు.