నిబంధనలకు లోబడే అనుమతులు.. నారా లోకేష్ పాదయాత్రపై చిత్తూరు ఎస్పీ కీలక వ్యాఖ్యలు..
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టనున్న పాదయాత్రకు అనుమతుల విషయంలో చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి స్పందించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టనున్న పాదయాత్రకు అనుమతుల విషయంలో చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి స్పందించారు. 27వ తేదీ నుంచి లోకేష్ పాదయాత్ర చేపట్టనున్నారని తమకున్న సమాచారం అని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా లోకేష్ పాదయాత్రకు సంబంధించి పర్మిషన్ అడుగుతూ వర్ల రామయ్య డీజీపీ లేఖ రాశారని గుర్తుచేశారు. దానికి డీజీపీ కార్యాలయం నుంచి సమాధానం వెళ్లిందని అన్నారు. అయితే స్థానికంగా మాజీ సీఎం చంద్రబాబు పీఏ మనోహర్, మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానిలతో పూర్తి వివరాలు, రూట్ మ్యాప్‌కు సంబంధించి మాట్లాడుతున్నట్టుగా చెప్పారు. వారిని కొన్ని క్లారిఫికేషన్స్ అడగటం జరిగిందని.. అందుకు సమాధానం కూడా ఇచ్చారని తెలిపారు. దాని ఆధారంగానే వారికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వడం లేదని చెప్పలేదని తెలిపారు.
చట్టప్రకారం అందరికి ఎలా పర్మిషన్ ఇస్తామో.. లోకేష్ పాదయాత్రకు కూడా అలానే ఉంటుందని చెప్పారు. నిబంధనలకు లోబడే పాదయాత్ర అనుమతి ఉంటుందని తెలిపారు. పాదయాత్రను ఆపాలనే ఉద్దేశం కూడా తమకు లేదని తెలిపారు. అనవసరంగా కొంత దుష్ప్రచారం జరుగుతుందని అన్నారు.
ఇదిలా ఉంటే.. జనవరి 27న కుప్పం నుంచి లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రను మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఈ నెల 25వ తేదీన లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. అదే రోజు రాత్రి లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకుంటారు. 26వ తేదీ ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంటారు. 27వ తేదీ కుప్పంలోని వరదరాజుస్వామి ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లోకేష్ కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు.