చిత్తూరుకు చెందిన ప్రేమలత అంత్యక్రియలు ఆదివారం అమెరికాలో పూర్తయ్యాయి. పూతలపట్టు  మండలం బందార్లపల్లికి చెందిన ప్రేమలత గత మంగళవారం అమెరికాలో మృతి చెందిన విషయం తెలిసిందే. 

మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావాలని ప్రేమలత కుటుంబ సభ్యులు నాలుగు రోజులుగా నిరీక్షించారు. కన్నకూతుర్ని కడసారి చూడాలని వేచి చూశారు. దీనికోసం తమ కుమార్తె మృతదేహం కావాలని ప్రేమలత భర్త, మామలతో పట్టుబట్టారు. కానీ వారికి నిరాశే ఎదురయ్యింది. 

కోవిడ్‌–19ను సాకుగా చూపి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకోరాలేతున్నామని భర్త చెబుతున్నట్లు కుటుంబ సభ్యులు వివరించారు. భారత కాలమానం ప్రకారం 9 గంటల ప్రాంతంలో అంత్యక్రియలను అక్కడ ప్రారంభించారు. సంప్రదాయం ప్రకారం దహన క్రియలను పూర్తి చేశారు. 

జూమ్‌ లింక్‌ సాయంతో ప్రేమలత అంత్యక్రియలను కుటుంబ సభ్యులు, బంధువులు వీక్షించారు. ఈ క్రమంలో మృతిరాలి ఇంటి వద్ద రాత్రి విషాదచాయాలు అలుముకున్నాయి. చివరి చూపు కూడా దూరమైందని తండ్రి కన్నీరుమున్నీరయ్యారు.

పూతలపట్టు మండలం బందార్లపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు కుమార్తె ప్రేమలతకు, అమెరికాలోని న్యూజెర్సీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లెకు చెందిన సుధాకర్‌ నాయుడుతో 2016లో వివాహమైంది. 2017లో సుధాకర్‌ దంపతులు అమెరికా వెళ్లారు. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు గీతాంష్‌ ఉన్నాడు. 

మంగళవారం రాత్రి ప్రేమలత ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. తమ కుమార్తెను సుధాకర్‌ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తండ్రి, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె మృతదేహాన్ని పంపించడానికి అల్లుడు నిరాకరిస్తున్నాడని, ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని మృతురాలి తల్లిదండ్రులు కలెక్టర్‌ భరత్‌నారాయణగుప్తాను కోరిన సంగతి తెలిసిందే.