Asianet News TeluguAsianet News Telugu

చిత్తూరు యువకుడి కోసం దేశం దాటేసిన శ్రీలంక యువతి.. గుడిలో పెళ్లి.. వార్త వైరల్‌గా మారడంతో..

ప్రేమ దేశాల హద్దులు దాటుతుంది. సోషల్ మీడియాలో పరిచయాలతో కొందరు దేశాలు బార్డర్ దాటి తాము ప్రేమించినవారి దగ్గరకు చేరుకుంటున్నారు.

Chittoor man ties the knot with a Sri Lankan woman here is the story ksm
Author
First Published Jul 30, 2023, 2:42 PM IST

ప్రేమ దేశాల హద్దులు దాటుతుంది. సోషల్ మీడియాలో పరిచయాలతో కొందరు దేశాలు బార్డర్ దాటి తాము ప్రేమించినవారి దగ్గరకు చేరుకుంటున్నారు. తాజాగా శ్రీలంకకు చెందిన  ఓ యువతి.. ఆంధ్రప్రదేశ్‌లోని  చిత్తూరు జిల్లాలోని యువకుడు.. సోషల్ మీడియాలో పరిచయం అయ్యారు. ఆ తర్వాత అది కాస్తా  ప్రేమగా మారింది.  ఈ క్రమంలోనే యువతి చిత్తూరు చేరుకుంది. దీంతో వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. 

వివరాలు.. చిత్తూరు జిల్లా అరిమాకులపల్లెకు చెందిన లక్ష్మణ్ (28) భవన నిర్మాణ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. లక్ష్మణ్‌కు  శ్రీలంకకు చెందిన యువతి శివకుమారి విఘ్నేశ్వరి (25)తో ఫేస్‌బుక్‌ ద్వారా 2017లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఫేస్‌బుక్‌లో తమ ఆలోచనలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ వికసించింది. ఈ జంట గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. ఈ క్రమంలోనే వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 

ఈ క్రమంలోనే విఘ్నేశ్వరి టూరిస్ట్‌ వీసాపై భారత్‌కు వచ్చింది. కొలంబో నుంచి జూలై 8న చెన్నైకి చేరుకుంది. ఆమెను రిసీవ్ చేసుకోవడానికి లక్ష్మణ్ చెన్నై వెళ్లాడు. అనంతరం ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. లక్ష్మణ్ తన కుటుంబ సభ్యుల అంగీకారంతో జూలై 20న చిత్తూరు జిల్లా వి కోటలో ఉన్న ఆలయంలో విఘ్నేశ్వరిని వివాహం చేసుకున్నాడు. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. 

దంపతులను తమ మందు హాజరుకావాలని చిత్తూరు జిల్లా పోలీసులు ఆదేశించారు. విఘ్నేశ్వరి వీసా గడువు ఆగస్టు 15తో ముగుస్తున్నందున చిత్తూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) వై రిశాంత్ రెడ్డి ఆమెకు నోటీసులు జారీ చేశారు. అప్పటిలోగా  విఘ్నేశ్వరి శ్రీలంకకు తిరిగి రావాలని పోలీసులు ఆదేశించారు. అయితే విఘ్నేశ్వరి తన దేశానికి తిరిగి వెళ్లేందుకు నిరాకరించింది. ఆమె తన భర్తతో కలిసి జీవించడానికి శాశ్వతంగా ఇక్కడే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. 

విఘ్నేశ్వరి భారత పౌరసత్వం పొందాలని యోచిస్తున్నారని, విధివిధానాలు, ప్రమాణాలను కూడా ఆమెకు వివరించామని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు  చెబుతున్నారు. ఇదిలాఉంటే, ఓవైపు శాశ్వతంగా భారత్‌లో ఉండేందుకు అభ్యర్థన చేస్తూనే.. మరోవైపు తిరిగి శ్రీలంక వెళ్లకుండా ఉండేలా తన వీసా గడువును పొడిగించాలని కోరుతూ విఘ్నేశ్వరి దరఖాస్తు కూడా చేసుకుంది. ఇక, భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు వీలుగా పెళ్లిని రిజిస్టర్ చేసుకోవాలని పోలీసులు దంపతులకు సూచించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios