కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అనేకమంది రాజకీయ నాయకులు కోవిడ్ బారిన బడి మృత్యువాత పడుతున్నారు. చిత్తూరు నగర టీడీపీ అధ్యక్షుడు, మాజీ మేయర్ కటారి హేమలత భర్త కటారి ప్రవీణ్ కరోనాతో మృతి చెందారు. 

కరోనా పాజిటివ్ తో వారం రోజుల క్రితం తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి ప్రవీణ్ చికిత్స తీసుకుంటున్నారు. ఆదివారం పరిస్థితి విషమించడంతో గత రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రవీణ్ మృతితో టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.  

ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా వైరస్ భారీగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. ఇప్పటికే సినీతారలు, క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సీనియర్ రాజకీయ వేత్త, మాజీ ఎంపీ సబ్బంహరి వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది.