రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఓ బైక్ ఢీ కొట్టిన ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం చిత్తూరు జిల్లా కురబలకోట వద్ద కడప-బెంగళూరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఓ బైక్ ఢీ కొట్టిన ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం చిత్తూరు జిల్లా కురబలకోట వద్ద కడప-బెంగళూరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

ఈప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కురబలకోట సమీపంలోని పుట్టారెడ్డిగారిపల్లెకు చెందిన చంద్రశేఖర్, దేవేందర్, దినేశ్‌ ముగ్గురు కలిసి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నారు. అయితే వీరు ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ సంఘటనా స్థలంలోనే మృతిచెందారు.

భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా పొగమంచు అలుముకుని ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో పాటు ఒకే బైక్ పై ముగ్గురు ప్రయాణించడంతో పాటు హెల్మెట్ ధరించకపోవడం ప్రమాద తీవ్రతను పెంచిందని భావిస్తున్నారు.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న మదనపల్లె పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదం కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.