ఆక్సీజన్ కొరతతో ఒక్క ప్రాణం కూడా పోకూడదంటూ.. మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన ఆక్సీజన్ బ్యాంక్ సేవలు ఇప్పుడు విశాఖ పట్నానికీ చేరుకున్నాయి. విశాఖ పట్నంలోని శ్రీకాంతి థియేటర్ ప్రాంగణలో చిరంజీవి ఆక్సీజన్ బ్యాంకు ప్రారంభమయ్యింది. 

ఈ కార్యక్రమానికి జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ కోవిడ్ రోగులకు ఆక్సిజన్ కొరత లేకుండా చేయాలనే చిరంజీవిగారి లక్ష్యమన్నారు. పేద రోగులకు అవసరం మేరకు ఇంటికే ఆక్సీజన్ సిలిండర్లు పంపిస్తామని తెలిపారు. 

ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సీజన్ కొరత తీర్చడానికి ప్రతి జిల్లాలో ఆక్సీజన్ బ్యాంకులు తెరుస్తున్నామని చెప్పారు. జిల్లాల వారీగా ప్రజలను ఆదుకోవడానికి చిరంజీవి అభిమానులు సేవలు అందిస్తారని సత్యనారాయణ వెల్లడించారు. 

కాగా, క‌రోనా క్రైసిస్ చారిటీ సేవ‌ల అనంత‌రం మెగాస్టార్ చిరంజీవి మరో మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆక్సిజ‌న్ బ్యాంకుల ఏర్పాటు ప్ర‌క్రియ పూర్త‌యింది. వారంలోగా ఈ ఏర్పాటు చేస్తామ‌ని మెగాస్టార్ ప్ర‌క‌టించిన‌ట్టే అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. జిల్లా అభిమాన సంఘాల అధ్య‌క్షుల ఆధ్వ‌ర్యంలో ఈ ఆక్సిజ‌న్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి.

ఆక్సిజన్‌ కొరతతో ఒక్క ప్రాణం కూడా పోకూడదుః ఆక్సిజన్‌ సిలిండర్ల పంపిణి ప్రారంభించిన చిరు...

మే 26 న కొన్ని జిల్లాలకు ఆక్సిజన్ పంపిణీ జ‌రిగింది. అనంత‌పూర్, గుంటూరు, శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ ప‌ట్నం, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల‌కు బుధ‌వారం సాయంత్రానికి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు అందుబాటులోకి వ‌స్తాయి. బ్ల‌డ్ బ్యాంక్ నుంచి ఇప్ప‌టికే ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు.. అలాగే తెలంగాణలోని పలు జిల్లాలకు కాన్ స‌న్ ట్రేట‌ర్లు పంపించారు. తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో ఈరోజు బుధవారం నాడు ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభమయ్యాయి.

ఇప్పుడున్న ఆక్సిజన్ సంక్షోభాన్ని అరికట్టే ఉద్దేశంతోనే దీన్ని ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మం ప్రారంభం సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ -``చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో నిరంత‌రాయంగా ఆక్సిజ‌న్ పంపిణీ కొనసాగుతుంది. ఇక్క‌డ స్కార్సిటీ వ‌ల్ల చైనా నుంచి ఆక్సిజ‌న్ కాన్ స‌న్ ట్రేట‌ర్లు ఆర్డ‌ర్ చేశాం.

దీన్ని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఆఫీసు నుంచి పర్యవేక్షణ ఉంటుంది. అన్నిచోట్లా ఇది స‌ద్వినియోగం కావాల‌నే మా ప్ర‌య‌త్నం. రామ్ చ‌ర‌ణ్ ఈ ఏర్పాట్ల‌న్నీ చూస్తున్నారు. ఇకపై ఏ ఒక్కరి ప్రాణాలు ఆక్సిజన్‌ అందకుండా పోకుండా ఉండాలన్నదే మా ప్రయత్నం` అని అన్నారు.