చిరంజీవి హాట్ టాపిక్: కొల్లు రవీంద్ర వ్యూహం ఇదీ...

Chiranjeevi became hot topic in AP politics
Highlights

 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి హాట్ టాపిక్ గా మారారు. 

మచిలీపట్నం: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి హాట్ టాపిక్ గా మారారు. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన అకస్మాత్తుగా చర్చనీయాంశంగా మారారు. 

మంత్రి కొల్లు రవీంద్ర కారణంగా ఆయనపై ఇప్పుడు పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తమ్ముడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లో తలమునకలై ఉండగా, ఆయన మాత్రం సినిమా షూటింగులు చేసుకుంటూ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 

ఎంపి ల్యాడ్స్ నిధులతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సహయాం చేసిన చిరంజీవికి కొల్లు రవీంద్ర కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాదులోని చిరంజీవి నివాసానికి వచ్చి ఆయన ఆ అభివృద్ధి వివరాలను తెలియజేశారు. 

చిరంజీవి ఎంపీగా ఉన్న సమయంలో మచిలీ పట్నంలో 5 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు తాను అడగగానే చిరంజీవి దాదాపు రూ. 5 కోట్ల మేర పనులకు ఎంపి ల్యాడ్స్ నిధులు కేటాయించారని కొల్లు రవీంద్ర చెప్పారు. 

అయితే, వ్యూహాత్మకంగానే కొల్లు రవీంద్ర చిరంజీవిని కలిశారనే ప్రచారం జరుగుతోంది. ఆయన చిరంజీవిని కలిసి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను కొల్లు రవీంద్రనే యూట్యూబ్ లో పెట్టించారనే ప్రచారం కూడా ఉంది. 

మచిలీపట్నంలో దాదాపు 50 వేల కాపు ఓట్లు ఉంటాయని, వచ్చే ఎన్నికల్లో ఆ ఓట్లు చేజారి పోకుండా చిరంజీవి మద్దతు ఉన్నట్లుగా ఆయన చిత్రీకరించుకున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ జనసేన పోటీ చేయనుండడం, వైఎస్సార్ కాంగ్రెసు తరఫున బలమైన నేత పేర్ని నాని పోటీ దిగుతుండడంతో కొల్లు రవీంద్ర తనకు అవసరమైన మద్దతును చిరంజీవి ద్వారా కూడగట్టుకోవడానికి ప్రయత్నించారని అంటున్నారు. 

loader