Asianet News TeluguAsianet News Telugu

సీఐ బారి నుంచి కాపాడండి.. సీఎం జగన్‌కు వైసీపీ మహిళా కౌన్సిలర్ విజ్ఞప్తి.. వైరల్‌ అవుతున్న వీడియో

ఆమె అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్.. అయినప్పటికీ ఆమెకు పోలీసుల నుంచి బెదిరింపులు తప్పలేదు. బెదిరింపులకు పాల్పడుతున్న సీఐ నుంచి తమను కాపాడాలని ఆమె నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రినే వేడుకున్నారు. తన సమస్యను వివరిస్తూ ఆమె ఓ వీడియో కూడా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా (Prakasam District) చీరాలలో చోటుచేసుకున్న ఈ ఘటన  తీవ్ర కలకలం రేపుతోంది.

chirala ysrcp woman councillor request ap cm ys jagan to take action against Police Official
Author
Chirala, First Published Jan 11, 2022, 10:30 AM IST

ఆమె అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్.. అయినప్పటికీ ఆమెకు పోలీసుల నుంచి బెదిరింపులు తప్పలేదు. బెదిరింపులకు పాల్పడుతున్న సీఐ నుంచి తమను కాపాడాలని ఆమె నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రినే వేడుకున్నారు. తన సమస్యను వివరిస్తూ ఆమె ఓ వీడియో కూడా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా (Prakasam District) చీరాలలో చోటుచేసుకున్న ఈ ఘటన  తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. అధికార YSR Congress Partyకి చెందిన సూరగాని లక్ష్మి చీరాల ఐదో వార్డు కౌన్సిలర్‌గా ఉన్నారు. తన భర్త నరసింహారావు స్థానికంగా బార్ అండ్ రెస్టారెంట్ ఉందని.. ఈ క్రమంలోనే తమకు సీఐ నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. బూతులు తిడుతున్నారని ఆమె ఆరోపించారు. న్యాయం చేయమని సీఎం జగన్‌ను వేడుకున్నారు. 

‘నా భర్త నరసింహారావు 17 ఏళ్లుగా బార్ అండ్ రెస్టారెంట్ నడుపుతున్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11.20 గంటలకు వన్ టౌన్ సీఐ రాజమోహన్.. అతని సిబ్బందితో రెస్టారెంట్‌లో వచ్చి నానా హంగామా సృష్టించారు. నా భర్తను చేయి పట్టుకుని లాగి.. రోడ్డు మీదకు ఈడ్చారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అడ్డొచ్చిన రెస్టారెంట్ సిబ్బందిని కొట్టారు. నా భర్తను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి వ్యాపారం ఏ విధంగా చేస్తావో చూస్తామని బెదిరించడమే కాకుండా.. బూతులు మాట్లాడారు. చెప్పలేని విధంగా మాట్లాడారు. దీనిపై జనవరి 1వ తేదీన పై అధికారులకు ఫిర్యాదు చేశాం. ఫిర్యాదు చేశామనే అక్కసుతో.. జనవరి 8వ తేదీ రాత్రి మళ్లీ వచ్చి తప్పుడు కేసులు పెడతానని అన్నాడు. చీరాలలో వ్యాపారం చేసుకోకుండా చేస్తానని బెదిరించడమే కాకుండా.. చెప్పలేని విధంగా బూతులు మాట్లాడారు. ఆతని వల్ల చీరాలలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. పై అధికారులకు ఎవరెన్ని ఫిర్యాదులు చేసిన కూడా.. అతడు ఇలానే చేసుకుంటూ పోతున్నాడు’ అని సూరగాని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. 

దయచేసి సామాన్యులకు న్యాయం చేయాలని సూరగాని లక్ష్మి సీఎం జగన్‌ను కోరారు. ఆ సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో  కౌన్సిలర్లకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే చీరాలలో స్థానిక వైసీపీ నాయకుల మధ్య వర్గపోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వీడియో బయటకు రావడం మరింత చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు తనపై సూరగాని లక్ష్మి చేసిన ఆరోపణలను  సీఐ రాజమోహన్ ఖండించారు. నూతన సంవత్సరం రోజున బార్‌‌లో నుంచి కేకలు వినపడటంతో తాను బయట ఉండి సిబ్బందిని లోపలకు పంపానని తెలిపారు. తాను ఎవరిని దూషించలేదని, ఎవరిపై దాడి చేయలేదని అన్నారు. తనపై ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios