సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీటింగ్స్ కి  జనాలు రావడం లేదని ఏపీ హోం మంత్రి చినరాజప్ప అన్నారు. జనాలు సభకు రాకపోవడంతో రెచ్చిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారని చినరాజప్ప ఎద్దేవా చేశారు.

కాకినాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చినరాజప్ప మాట్లాడారు. సీఎం కావాలనే తపన పవన్ లో రోజురోజుకీ పెరిగిపోతోందన్నారు. అందుకే జనంలోకి వెళ్లి చప్పట్లు కొట్టించుకున్నారని ఆరోపించారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉండాలి కానీ.. వేరే వాళ్లని చెడు చేసే ఆలోచన ఉండకూడదన్నారు.

మంత్రి లోకేష్ ని టార్గెట్ చేస్తూ.. పవన్ చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని చినరాజప్ప అభిప్రాయపడ్డారు. సినిమా బ్యగ్రౌండ్ నుంచి ఉన్న కుటుంబాలకు సినిమాలపై ఆసక్తి ఉన్నట్టే.. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంటే రాజకీయాలపై ఆసక్తి ఉంటుందన్నారు.

లోకేష్.. చంద్రబాబు వారసత్వం తీసుకుంటున్నాడని విమర్శలు చేసే పవన్.. ఆయన సినిమాల్లోకి రావడానికి వాళ్ల అన్న చిరంజీవిని వాడుకున్నాడనే విషయాన్ని మర్చిపోవద్దని హితవు పలికారు. నలభై సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబుకి.. అసలేమీ తెలియని పవన్ తో పోలికేంటని ఆయన అన్నారు.