టీడీపీ నేత కోడెల శివరాం మీద తెనాలి పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. కంపెనీలో పెట్టుబడుల విషయంలో మోసం చేసిన నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. 

తెనాలి : దివంగత కోడెల శివప్రసాదరావు కొడుకు కోడెల శివరాం పై చీటింగ్ కేసు నమోదయ్యింది. తన కంపెనీలో పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని కొందరు బాధితులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు అతనిమీద కేసు నమోదు చేశారు. శివరాం కు చెందిన కైరా ఇన్ ఫ్రా కంపెనీలో 2016లో తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన యలవర్తి సునీత రూ.26,25,000, పాలడుగు బాల వెంకట సురేష్ రూ.24,25,000 పెట్టుబడి పెట్టారు. వీరి పెట్టుబడి, అందుకు తగిన ప్రతిఫలాన్ని మరుసటి ఏడాది 2017లో తిరిగి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఎన్నిసార్లు అడిగినా డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో ఆశ్రయించారు. కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రూరల్ ఎస్సై జి ఏడుకొండలు శివరాం మీద సోమవారం చీటింగ్ కేసును నమోదు చేశారు.

కుప్పంలో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్.. గ్రామస్థాయి నాయకులే టార్గెట్.. ఉలిక్కిపడుతున్న టీడీపీ..

ఇదిలా ఉండగా, ఫిబ్రవరిలో కోడెల శివరాం అరెస్టయ్యారు. కొండమోడు- పేరేచర్ల రోడ్డు విస్తరణ చేపట్టాలని, దేవరంపాడు ఆలయ అభివృద్ది పనులు చేయాలన్న డిమాండ్లతో కోడెల శివరాం ఫిబ్రవరి 19న చంద్రన్న అశయ సాధన యాత్ర మొదలుపెట్టారు. దీంతో కోడెల శివరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. శివరాం అరెస్టులో సత్తెనపల్లి పట్టణంలో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్, కోడెల శివరాం కార్యలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. 

శివరాం పాదయాత్రకు అనుమతి లేదని ఏపీ పోలీసులు అంటున్నారు. పాదయాత్రకు వెళ్లకుండా టీడీపీ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు పోలీసులు. రాజుపాలెం నుంచి దేవరంపాడు వేంటేశ్వస్వామి గుడి దగ్గరి వరకు పాదయాత్ర, అనంతరం దేవరంపాడు గుడి దగ్గర భోజనం ఏర్పాట్లను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ భవన్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.