మార్కిస్ట్ యోధుడు చేగువేరా జీవితం తన మీద ఎంతో ప్రభావం చూపిందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. చేగువేరా మైనపు విగ్రహం పక్కన తన కూతురు దిగిన ఫోటోను పవన్ కళ్యాణ్ శనివారం నాడు షేర్ చేశారు.
విశాఖ: మార్క్సిస్ట్ యోధుడు, క్యూబా విప్లవకారుడు చేగువేరా ప్రభావం తన జీవితంపై ఉందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. శనివారం నాడు
తన కూతురు పొలినా అంజని చేగువేరా విగ్రహం పక్కన దిగిన ఫోటోను ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
సెయింట్ పీటర్ బర్గ్ మ్యూజియంలోని తన కుమార్తె చేగువేరా మైనపు విగ్రహం పక్కన దిగిన ఫోటో అంటూ ఆయన ఆ ఫోటో గురించి వివరించారు. తాను నెల్లూరులో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదివే సమయంలో చేగువేరా జీవితం గురించి చదివినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు.
ప్రపంచంలో అరాచకం, దోపిడీ, నిరంకుశత్వం ఉన్న వ్యవస్థల వల్ల ప్రజలు తీవ్ర బాధలు పడుతున్నప్పుడు.. నువ్వు ఆ దేశపు మనిషివి కానప్పటికీ నీకు వ్యక్తిగతంగా ఏమి జరగనప్పటికీ నువ్వు పెరిగిన దేశపు, సమాజపు హద్దులను చెరిపేసి ప్రపంచ పీడిత ప్రజలకి అండగా నిలబడాలనే అనే విషయాన్ని తాను చేగువేరా జీవితం నుండి నేర్చుకొన్నట్టు ఆయన చెప్పారు.
చేగువేరా జీవితం నుంచి తాను ఎంతో నేర్చుకొన్నానని ఆయన చెప్పారు. జీవితం అంతిమ క్షణాల వరకు తాను నమ్మిన సిద్దాంతంతోనే నడిచి చూపించిన విశ్వనరుడు చేగువేరా అంటూ ఆయన కొనియాడారు.
అందుకేనేమో దశాబ్దాల క్రితం ఎక్కడో దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాలో పుట్టి పెరిగి, క్యూబా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో పోరాటాలు చేసిన చేగువేరా చిత్రం ఉత్తరాంధ్రలోని ఓ మూలకి విసిరినట్టుండే ఇచ్ఛాపురంలో స్వేచ్ఛామాత గుడికి వెళ్లే వీధికి ఎదురుగా ఒక మహనీయుడి చెప్పుల దుకాణంపైన నాకు దర్శనమిచ్చిందని పవన్ చెప్పారు.
