వైఎస్ఆర్ జలకళ పథకంలో ఏపీ సర్కార్ స్వల్ప మార్పులు చేసింది. ఈ పథకంలో భాగంగా ఉచిత బోర్లతో పాటు పంపు సెట్లు, మోటార్లను ఉచితంగానే అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జలకళ పథకంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. రైతులకు ఉచితంగా బోర్లు తవ్వటంతో పాటు చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగానే పంపు సెంట్లు, మోటార్లు బిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అలాగే ఉచితంగానే విద్యుత్ కనెక్షన్స్ కూడా అమర్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. బోర్ల లోతు, భూమి రకం, ఎంత మేర పంట సాగవుతోందన్న అంశాల ఆధారంగా పంపు సెట్లు, మోటార్లను బిగించాలని నిర్ణయించింది.

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు ద్వారా వారి మెట్ట భూములకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ జలకళ పథకాన్ని అమలు చేయనున్నారు. శాస్త్రీయంగా భూగర్భ జల సర్వే అనంతరం బోరు వేసే ప్రాంతాన్ని గుర్తించనున్నారు.

బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను పాదయాత్రలో స్వయంగా చూసిన జగన్‌ వారికి అండగా నిలుస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. నవరత్నాల్లో భాగమైన ఆ హామీని నెరవేర్చడానికి రంగం సిద్ధం చేశారు.