Asianet News TeluguAsianet News Telugu

కొడుకు కోసం రూట్ క్లియర్ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. 2024 ఎన్నికల్లో పోటీకి దూరం..

చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని తెలిపారు. తన స్థానంలో తన కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీచేస్తారని ప్రకటించారు. 

Chandragiri YSRCP MLA not contesting in 2024 general elections, to pave way for his son - bsb
Author
First Published Apr 1, 2023, 10:10 AM IST

చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది. చంద్రగిరి వైఎస్‌ఆర్‌సిపి శాసనసభ్యుడు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల నుంచి తప్పుకుంటున్నారు. చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుండి వైఎస్‌ఆర్‌సిపి టిక్కెట్‌పై తన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తారని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ప్రభుత్వ విప్, తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) చైర్మన్‌గా, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్‌ అఫీషియో మెంబర్‌గా అనేక అదనపు నామినేటెడ్ పదవులను కూడా కొనసాగిస్తున్నారు.

ఈ నామినేటెడ్ పదవులతో పాటు, డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి వైఎస్‌ఆర్‌సిపి జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇటీవల పార్టీ ఫ్రంటల్ సంస్థల రాష్ట్ర సమన్వయకర్తగా నియమితులయ్యారు.2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను అధికార పార్టీ నాయకత్వం అధికారికంగా ప్రకటించనప్పటికీ, చంద్రగిరి అసెంబ్లీ స్థానానికి చెవిరెడ్డి తన కుమారుడిని తదుపరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 175 స్థానాల్లో విజయం సాధించాలని అధికార పార్టీ భావిస్తోంది.

గన్నవరం వైసీపీ నేతలు యార్లగడ్డ, దుట్టాకు నాన్‌ బెయిలబుల్ వారెంట్లు జారీ..

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం పాకాలలో అధికారికంగా ప్రకటన చేసిన కొద్ది క్షణాలకే చంద్రగిరికి చెందిన ఆయన అనుచరులు, వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు చెవిరెడ్డి కుటుంబంలో “పుత్రోదయం” అంటూ స్వాగతం పలికారు. మరోవైపు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇప్పుడు చంద్రగిరి నుంచి వైఎస్సార్‌సీపీ టికెట్‌పై పోటీ చేయనున్న నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు భూమాన కరుణాకర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన తిరుపతి అసెంబ్లీ స్థానంపైనే ఉంది. 

కరుణాకర్ రెడ్డి తనయుడు, డిప్యూటీ మేయర్‌ అయిన భూమన అభినయ్ రెడ్డిని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి బరిలోకి దింపవచ్చు అని ఊహాగానాలు వచ్చాయి. ఇదిలావుండగా, అత్యంత కీలకమైన 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అవకాశాలను పటిష్టం చేసే ముఖ్యమైన బాధ్యతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించినందున రాష్ట్ర స్థాయి పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్న క్రమంలో చిత్తూరు కీలకంగా మారింది. గత ఎన్నికల్లో చిత్తూరులో చంద్రబాబు పోటీ చేసిన స్తానం తప్ప అన్ని చోట్ల వైసీపీ విజయం సాధించింది. ఈసారి కూడా అన్ని స్థానాలూ వైసీపీనే గెలుచుకోవాలని వ్యూహాలు పన్నుతోంది. దీంట్లో భాగంగానే కొన్ని నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం ఇస్తోంది. ఈ క్రమంలో చంద్రగిరి స్థానం మీద ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.మొదటి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్సార్ కుటుంబానికి విధేయుడిగా ఉన్నారు. వైఎస్సార్ మృతి తరువాత వైసీపీ ఆవిర్భావం దగ్గర్నుంచి జగన్ కు మద్దుతుగా ఉన్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ నుంచి 2014, 2019ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 

Follow Us:
Download App:
  • android
  • ios