కొందరు నేతలు మీడియాతో మాట్లాడదామని అనుకున్నా.. అదిష్టానం సూచనల మేరకు వెనక్కి తగ్గారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కారును మార్చినంత సులభంగా భార్యలను మారుస్తారంటూ.. జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపాయి. నిన్న మొన్నటి దాకా.. వైసీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం ఉండేది. జగన్ చేసిన వ్యాఖ్యలతో స్నేహం కాదు కదా.. వైరం మొదలైంది. ఇప్పటికే ఒకరిపై మరొకరు రెండు పార్టీల నేతలు విమర్శలు చేసుకుంటున్నారు.
తానైతే ఎవరి వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్లనని పవన్ కూడా స్టేట్ మెంట్ ఇచ్చేశారు. అంతేకాదు.. జగన్ కుటుంబ సభ్యులను, మహిళలను ఈ వివాదంలోకి తీసుకురావద్దంటూ తన అభిమానులకు సైతం పవన్ విన్నవించారు.
ఇదిలా ఉంటే.. వీరిద్దరి వివాదంలోకి టీడీపీ నేతలు ఎవరూ తలదూర్చవద్దంటూ చంద్రబాబు ఆ పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం. ఏదైనా ఉంటే వారిద్దరే తేల్చుకుంటారని.. మీరెవ్వరూ ఈ విషయంపై మీడియాతో చర్చించవద్దని చెప్పినట్లు తెలుస్తోంది.
బుధవారం ఈ అంశంపై విలేకరుల సమావేశం నిర్వహించాలనుకొన్న విజయవాడ నగర ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఈ సమాచారం అందడంతో దానిని రద్దు చేసుకొన్నారు. చంద్రబాబు సూచనలు అందని మంత్రి పత్తిపాటి పుల్లారావు మాత్రం ఈ విషయంపై స్పందించారు.
జగన్.. పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. తర్వాత కొందరు నేతలు మీడియాతో మాట్లాడదామని అనుకున్నా.. అదిష్టానం సూచనల మేరకు వెనక్కి తగ్గారు.
