చంద్రబాబు ఆరోగ్యం బాగాలేదు.. నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా చేర్చారు.. లాయర్లు
చంద్రబాబుకు హైబీపీ ఉందని, డయాబెటిస్ ఉందని.. ఆరోగ్యం బాగాలేదని ఆయన లాయర్లు అన్నారు. ఈ కారణాలతో ఆయనను విమానంలో విజయవాడకు తరలించాలని కోరారు.

నంద్యాల : చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఆయన లాయర్ రామ చంద్రరావు మీడియాతో అన్నారు. బీపీ ఎక్కువగా ఉంది, ఆయనకు డయాబెటిస్ ఉంది అని తెలిపారు. వైద్యపరీక్షల తరువాత సీఐడీ అరెస్ట్ చేయబోతున్నారని తెలిపారు. స్కిల్ డెవల్మెంట్ స్కాం కేసు కింద చంద్రబాబును అరెస్ట్ చేశారు.
ఆయనను 52 సీఆర్పీసీ ప్రకారం అరెస్ట్ చేస్తున్నామని తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 166, 167,418, 420 కింద కేసులు పెట్టారు. సెక్షన్లు 465,468, 479, 409,201 లు ఆయన మీద పెట్టారు. ఇందులో కొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయని రామ చంద్రరావు అన్నారు. ఆయనను నంద్యాల నుంచి విజయవాడ తరలించనున్నారు.
నంద్యాలలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ .. విజయవాడకు తరలింపు...
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయనను ఇక్కడినుంచి విమానంలో తరలించాలని వారు కోరుతున్నారు. రోడ్డు మార్గంలో అయితే ఆరు గంటలపాటు ప్రయాణం అని.. అంత ప్రయాణంతో ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందని తెలిపారు. చంద్రబాబుతో పాటు సీఎస్ఓ, ఎన్ఎస్ జీ కూడా వెళ్లనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎ1గా చంద్రబాబు, ఏ2గా అచ్చెన్నాయుడు పేర్లను సీఐడీ చేర్చింది.
అరెస్టకు ముందు 6 గంటలపాటు నంద్యాలలో హైడ్రామా నడిచింది. రాత్రి 11 గంటలనుంచే అటు టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉన్నారు. అర్థరాత్రి దాటిన తరువాత ఒక్కసారిగా పోలీసులు, సీఐడీ అధికారులు పెద్ద ఎత్తున చంద్రబాబు బస చేసిన చోటికి వెళ్లారు.
దీనికి ముందే నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్ కే ఫంక్షన్ హాల్ లోకి ఎలా వెళ్లాలి, టీడీపీ శ్రేణులను ఎలా అడ్డుకోవాలి... అని పక్కా ప్రణాళిక ప్రకారం సీఐడీ వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఒక మాజీ ముఖ్యమంత్రి వద్దకు అర్థ రాత్రి రావాల్సిన అవసరం ఏముందని నాయకులు ప్రశ్నించారు. అసలు కేసు ఎంటి అని నాయకులు, కార్యకర్తలు అడిగినా పోలీసులు సమాధానం ఇవ్వలేదు.
చంద్రబాబు నాయుడు బస చేసిన బస్ దగ్గర ఉన్న నాయకులను మొదట బయటికి పంపారు పోలీసులు. ఈ సమయంలో పోలీసులతో నేతలు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. మాజీ మంత్రి అఖిల ప్రియను బయటకు తీసుకు వెళ్లిన పోలీసులు ఆ తరువాత అరెస్ట్ చేశారు.
ఆ తరువాత చంద్రబాబు బస వద్దకు పోలీసు వాహనం తీసుకువచ్చారు. 5.30 గంటల ప్రాంతంలో చంద్రబాబు బస్సు తలుపులను గట్టిగా కొట్టారు. ఆ తరువాత బస చేసిన బస్సు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు కిందకు దిగారు. ఆయనను చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చంద్రబాబు గంటపాటు వారితో వాగ్వాదం చేశారు. ‘నా హక్కులు ఉల్లంఘిస్తున్నారు. నేను తప్పు చేస్తే నడిరోడ్డులో ఉరేయండి. ఏ చట్ట ప్రకారం నన్ను అరెస్ట్ చేస్తారు? ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు?’ అంటూ మండిపడ్డారు. దీనికి సీఐడీ సమాధానం ఇస్తూ.. హైకోర్టుకు ప్రాథమిక ఆధారాలు ఇచ్చామన్నారు. ఎఫ్ఐఆర్ ఇస్తామని పోలీసులు తెలిపారు.