అమరావతి:  ఫోన్ ట్యాపింగ్ పై  ఆధారాలు ఇవ్వాలని డిజిపి లేఖ రాయడం విడ్డూరమని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ప్రధానికి నేను లేఖ రాస్తే డిజిపి హుటాహుటిన స్పందించడం విచిత్రంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల నాయకులపై దాడులు-దౌర్జన్యాలు, తప్పుడు కేసులపై గతంలో ఇచ్చిన వినతులు, రాసిన లేఖలపై డిజిపి ఏం చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు.

వైసిపి తప్పుల మీద తప్పులు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందన్నారు. రాష్ట్రంలోని  వ్యవస్థలన్నీఉన్మాదంతో ధ్వంసం చేస్తోందని ఆయన వైసీపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.

టిడిపి ప్రజా ప్రతినిధులు, అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్ధులు పార్టీ సీనియర్ నేతలతో మంగళవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టిడిపిపై తప్పుడు ప్రచారంతో వైసిపి అధికారంలోకి వచ్చింది. అదే తప్పుడు ప్రచారాన్ని గత 15నెలలుగా కొనసాగిస్తోందన్నారు.

గోదావరి వరదల ఉధృతికి నిన్న ఆవ భూముల్లో భుజాల దాకా నీళ్లు చేరాయి. పేదలకు ఇళ్ల స్థలాలు ముంపు భూముల్లో ఇస్తారా..? అని ప్రజలే నిలదీస్తున్నారు. ఎకరం రూ5లక్షల భూమిని రూ50లక్షలకు కొన్నారు. 16అడుగులు లెవలింగ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో దేవుడికే తెలియాలన్నారు.

సెంటు పట్టా కాదు ఇది వైసిపి స్కామ్ పట్టా.. భూసేకరణలో అవినీతి, లెవలింగ్ లో అవినీతి, పట్టాకు రూ30వేలు, రూ60వేలు, రూ లక్షా 10వేల చొప్పున వసూళ్లు.. సాక్ష్యాధారాలతో సహా వైసిపి నాయకుల స్కామ్ లు బైటపడినా చర్యలు లేవన్నారు.

ఏ ఆధారాలు లేకపోయినా అచ్చెన్నాయుడిని, కొల్లు రవీంద్రను జైలుకు పంపారు. కక్షతో కేసుల మీద కేసులు పెట్టి జెసి ప్రభాకర్ రెడ్డిని, అస్మిత్ రెడ్డిని వేధిస్తున్నారు. 
టిడిపి నాయకులు, కార్యకర్తలపై దాడులతో పాటు, ఇప్పుడు ప్రజలపై దౌర్జన్యాలకు తెగబడ్డారన్నారు.

విశాఖ దళిత వైద్యుడు సుధాకర్ రావుపై దమనకాండ. చిత్తూరు దళిత డాక్టర్ అనితారాణిపై అమానుషం. విజయవాడలో డా రమేష్ బాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా బెదిరిస్తున్నారని ఆయన విమర్శించారు.

కరోనా కంటే కుల వైరస్ ఏపి లో ఉధృతంగా ఉందని సినీ నటుడు రామ్ ట్వీట్ చేయడం రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. రామ్ సినిమాలు రాష్ట్రంలో ఆడనివ్వం అని వైసిపి బెదిరించడం హేయమన్నారు.


ఫోన్ ట్యాపింగ్ వైసిపికి ముందునుంచి ఉన్న అలవాటే..గతంలో సిబిఐ జెడి లక్ష్మీనారాయణ ఫోన్లు ట్యాప్ చేసిన చరిత్ర వీళ్లది. చివరికి ఇప్పుడు డాక్టర్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసే దుస్థితికి వచ్చారన్నారు.

వైసిపి నిర్లక్ష్యం కారణంగానే మహారాష్ట్రతో సమానంగా ఏపిలో యాక్టివ్ కేసులు పెరిగాయి. ప్రతి లక్ష జనాభాకు కేసుల సంఖ్యలో ఏపి మొదటి స్థానంలో ఉందని ఆయన చెప్పారు.  

 టిడిపి నాయకులపై ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, ఎవరిని అక్రమంగా జైళ్లకు పంపాలా అనేదే ఆలోచిస్తున్నారు.పోగాలం దాపురించినప్పుడు ఇలాంటి దుర్మార్గాలే చేస్తారన్నారు.

బాధిత దళిత కుటుంబాలకు టిడిపి తరఫున ఆర్ధిక సాయం అందించి ఆదుకున్నాం. వైసిపి బాధిత దళితులకు అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
 

గోదావరి వరదల ఉధృతితో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో అనేక గ్రామాలు వరద నీట మునిగాయి. సహాయ, పునరావాస చర్యలలో వైసిపి ప్రభుత్వం విఫలమైందన్నారు.  

తక్షణమే వరద బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవాలి. తాగునీరు, పులిహోర ప్యాకెట్లు, భోజన ప్యాకెట్లు పంపిణీ చేయాలి. మండలానికి ఒకరు బాధ్యత తీసుకోవాలి. బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవాలని ఆయన పార్టీ నేతలను ఆదేశించారు.