హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు హైద్రాబాద్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహాన్‌తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిగా ఓటమి పాలైన తర్వాత గవర్నర్‌తో చంద్రబాబునాయుడు భేటీ కావడం ఇదే తొలిసారి.

గత నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబునాయుడు తన రాజీనామా లేఖను ఫాక్స్ ద్వారా గవర్నర్‌కు పంపారు. బాబు రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపారు. 

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రయాణిస్తున్న ఎయిరిండియా విమానాన్ని అధికారులు దారి మళ్లించారు.  రాత్రి 7 గంటలకు విమానం గన్నవరం నుంచి హైదరాబాద్‌ బయలుదేరింది. 

విమానం ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని బెంగళూరుకు మళ్లించినట్లు అధికారులు పేర్కొన్నారు. రాత్రి 9.20 గంటలకు బెంగళూరులో విమానం ల్యాండ్‌ అయింది. విమానం కాసేపట్లో హైదరాబాద్‌ బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.