తాడేపల్లి గూడెం: కేంద్రప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో జరిగిన ధర్మపోరాట దీక్షలో పాల్గొన్నచంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం నిధులివ్వకుండా ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటుందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చెయ్యడంలో కేంద్రప్రభుత్వం విఫలమైందన్నారు. 

ప్రధాని నరేంద్రమోదీ టీడీపీ ఎంపీలను భయపెట్టాలని చూశారని ఆరోపించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎవరికి భయపడే ప్రసక్తే లేదన్నారు. తెలుగుదేశం పార్టీని భయపెట్టాలని చూసి తోకముడిచారని అన్నారు. తెలుగు ప్రజలను భయపెడితే బొబ్బిలి పులిలా, కొండవీటి సింహాంలా తిరగబడతారని చంద్రబాబు హెచ్చరించారు. 

పునర్విభజన చట్టంలోని హామీల విషయంలో కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేస్తోందని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఆంధ్రాకు ఇవ్వాల్సిన హామీలు అమలు చెయ్యకుండా మెుకాలడ్డుతుందని ఆరోపించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం వివాదాలు సృష్టిస్తోందన్నారు. 

పునర్విభజన చట్టంలోని హామీలు నెరవేర్చని నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీకే చెందిందని చంద్రబాబు నాయుడు తెలిపారు. పార్లమెంట్ లో కేంద్రంపై ఎంపీలు చేసిన పోరాటాన్ని చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. 

మరోవైపు రాజధాని నిర్మాణానికి సైతం కేంద్రం అడ్డుతగులుతుందన్నారు. తెలుగు ప్రజలచిరకాల వాంఛ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకరించడం లేదన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం ప్రాజెక్టును నిర్మించి తీరుతామని తెలిపారు. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతికి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఇవ్వడం లేదన్నారు. రాజధానికి అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం ఉండదా అని ప్రశ్నించారు. 

డొలెరో నగరానికి మోడీ రూ.3వేల కోట్లు కేటాయించారని, బుల్లెట్ ట్రైన్ కు లక్షా 10 వేల కోట్లు ఇచ్చారని ఏపీ రాజధాని నిర్మాణానికి మాత్రం కేవలం రూ.1500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అమరావతిని నిర్మించి తీరుతానన్నారు. ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ నగరాలలో అమరావతి ఉంటుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.