అమరావతి: తాను సీఎంగా ఉన్న సమయంలో కూడ  వడ్డీ మాఫీని చేసినట్టుగా టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు. కరువు మండలాలను ప్రకటిస్తే రుణాలు  ఆటోమెటిక్‌గా రీ షెడ్యూల్ అవుతాయన్నారు.ఇప్పుడు సీఎం జగన్‌ రాజీనామా చేస్తారా అని  ప్రశ్నించారు.

గురువారం  సాయంత్రం అమరావతిలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు  మీడియాతో మాట్లాడారు. తాను సీఎంగా ఉన్న సమయంలో  లక్ష రూపాయాల లోపు రుణాలు మాఫీ చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమపై అసభ్యంగా మాట్లాడారని ఆయన చెప్పారు.

కరువుపై చర్చను వదిలేసి వ్యక్తిగతంగా తనను దూషించేందుకు ప్రయత్నించారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. అసెంబ్లీలో విపక్షాన్ని కించపర్చేలా మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు.  కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ తనను గాడిదలు కాశారా అని మాట్లాడారని ఆయన గుర్తు చేశారు.

వడ్డీ రాయితీ ఇవ్వలేదని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సకాలంలో రుణాలు చెల్లించినవారికి వడ్డీ రాయితీ ఇచ్చినట్టుగా చంద్రబాబు చెప్పారు.  గత ప్రభుత్వంలో కూడ వడ్డీ రాయితీలను ఇచ్చినట్టుగా  ఆయన గుర్తు చేశారు.

ఏమీ తెలియకుండా సీఎం జగన్ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.ముఖ్యమంత్రిగా ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడడం సరైందికాదన్నారు.రైతులకు సున్న వడ్డీతో రుణాలు ఇవ్వడం కొనసాగుతున్న స్కీమ్‌ అని ఆయన గుర్తుచేశారు. వైఎస్ జగన్ కొత్తగా తీసుకొచ్చిన  స్కీమ్ కాదన్నారు.