హైదరాబాద్: ఇళ్ల పట్టాల పేరుతో భూసేకరణలో అవినీతి జరిగిందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఇళ్ళ నిర్మాణానికి అనువుగాని భూముల సేకరించడం నిబంధనలకు వ్యతిరేకమన్నారు.

ఆవ భూముల సేకరణలోనే రూ. 500 కోట్లు అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు.  తూర్పు గోదావరి జిల్లా రాజానగరం, కోరుకొండ, బూరుగుపూడిలలో భూ సేకరణే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు.

600 ఎకరాల ఆవ భూములను ఇళ్లపట్టాల కోసం సేకరించినట్టుగా ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు.  ఎకరం భూమికి రూ. 45 లక్షల చొప్పున రూ. 270 కోట్లు ఖర్చు చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణానికి అనువుగాని భూములను చదును చేయడానికి రూ. 250 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయన్నారు.

ఆవ భూముల్లో ఇళ్లను నిర్మిస్తే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.భూసేకరణ, పునరావాస చట్టం 2013 కింద భారీ మొత్తం చెల్లించారని చంద్రబాబు ఆరోపించారు. వాటాల కోసం భూ యజమానులపై వైసీపీ నేతలు ఒత్తిడి చేశారని ఆయన విమర్శించారు.

ఇళ్ల పట్టాల కోసం భూసేకరణలో చోటు చేసుకొన్న అవినీతిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని బాబు ఆ లేఖలో సీఎస్ ను కోరారు.