Asianet News TeluguAsianet News Telugu

ఆ సమస్యల పరిష్కారం కోసం... జలవనరుల శాఖ కార్యదర్శికి చంద్రబాబు లేఖ

చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో సాగు, తాగు నీటి ఎద్దడి కారణంగా రైతులు, ఇతర వర్గాల ప్రజల ఇక్కట్లు వర్ణనాతీతంగా వున్నాయని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. 

chandrababu writes letter to ap irrigation special secretary
Author
Amaravathi, First Published Jun 26, 2020, 7:21 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

గుంటూరు: తన సొంత జిల్లా మరీ ముఖ్యంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం  నియోజకవర్గంలో తాగు, సాగు నీటి ఎద్దడి నెలకొనడంతో మాజీ సీఎం, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ సమస్యను ముందుగానే పసిగట్టి రాష్ట్ర విభజన అనంతరం తాము అనేక చర్యలు చేపట్టామని... అవి చివరిదశలో వుండగా వైసిపి అధికారంలోకి వచ్చి నిర్లక్ష్యం చేసిందన్నారు. ఇప్పటికైనా తాము చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసి చిత్తూరు పశ్చిమ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చాలంటూ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ రాశారు. 

చంద్రబాబు లేఖ యధావిధిగా...

జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగారికి,

అమరావతి, ఆంధ్రప్రదేశ్

నమస్కారాలు.

విషయం: కుప్పం నియోజకవర్గంలో తాగునీరు, సాగునీటి కొరత-హంద్రి నీవా పనులు, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల నిలిపివేత-కష్టనష్టాల్లో రైతులు, పేదలు, మహిళలు-త్వరితగతిన పనుల పూర్తి చేయడం గురించి..
                                           

చిత్తూరు జిల్లాలో పశ్చిమ ప్రాంతం కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో సాగు, తాగు నీటి ఎద్దడి కారణంగా రైతులు, ఇతర వర్గాల ప్రజల ఇక్కట్లు వర్ణనాతీతం. రాష్ట్ర విభజన అనంతరం ఈ ప్రాంత ప్రజల నీటి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టింది. హంద్రీ-నీవా సుజల స్రవంతి 2వ దశ పనులను ఈ రెండు నియోజకవర్గాలకు పొడిగించి నీటి ఎద్దడి నివారణకు ఇతోధిక కృషి చేశాం. దీనికి కావాల్సిన భూసేకరణ జరిపి యుద్ధప్రాతిపదికన పనులను చేపట్టాం. 123కిమీ పొడవైన కాలువ నిర్మాణం 3లిఫ్ట్ ల ఏర్పాటుతో 110చెరువుల అనుసందానానికి మార్గం సుగమం చేశాం. 121కిమీ కాలువ తవ్వకం పూర్తయ్యింది, 2.2కిమీ పనులు పురోగతిలో ఉన్నాయి. 324 స్ట్రక్చర్లకుగాను 221 స్ట్రక్చర్ల నిర్మాణం పూర్తయ్యింది, 44 స్ట్రక్చర్ల పనులు పురోగతిలో ఉన్నాయి, మరో 59 స్ట్రక్చర్ల పనులు ప్రారంభం కావాల్సి ఉంది. 1.43లక్షల క్యూమీ ఎర్త్ వర్క్, 23వేల క్యూమీ కాంక్రీట్ పనులు చేయాల్సి వుంది. మొత్తం రూ575కోట్ల పనులకుగాను, రూ490కోట్ల పనులు పూర్తయ్యాయి, మరో రూ30కోట్ల పనులకు బిల్లులు చెల్లించాల్సివుంది, ఇంకా రూ50కోట్ల విలువైన పనులు మాత్రమే పెండింగ్ వున్నాయి. 

 శ్రీశైలం నీటిని పలమనేరు నియోజకవర్గం వి కోట మండలం దాకా ప్రయోగాత్మకంగా విడుదల చేయడం జరిగింది. జిల్లాలో పశ్చిమ ప్రాంతానికి తొలిసారిగా నీళ్లు రావడం చూసి సంబరాలు చేసుకున్నారు. హంద్రీ నీవా 2వ దశ 90% పనులు పూర్తి అయినప్పటికీ మిగిలిన 10% పనులు గత 13నెలలుగా పెండింగ్ కారణంగా కుప్పం నియోజకవర్గానికి శ్రీశైలం జలాలు చేరలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో మార్పులు నీటిపారుదల ప్రాజెక్టుల పనులకు తీవ్ర విఘాతంగా మారాయి. హరితాంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని మార్చాలన్న సంకల్పానికి అవరోధంగా మారింది. గత ఏడాదిగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో జలవనరుల పనులు ఆగిపోవడం బాధాకరం. పనుల్లో ప్రతిష్టంభన కారణంగా ఆశించిన లక్ష్యాల సాధనకు గండిపడింది. 

తమ భూముల్లోకి కృష్ణా జలాలు తరలివస్తాయని ఆశించిన రైతుల కలలపై నీళ్లు జల్లినట్లయ్యింది. అటు బోర్లు ఎండిపోయి, ఇటు ట్యాంకర్లతో తాగునీరు అందక ఈ ప్రాంత ప్రజల దాహార్తి వెతలు అన్నీఇన్నీ కావు. ఒకవైపు కరోనా కష్టాలు, మరోవైపు తాగునీటి వెతలు, ఇంకోవైపు సాగునీటి కొరత స్థానికుల సహనానికి పరీక్షగా మారాయి. భూగర్భ జలాలు పడిపోయి, బోర్లు అడుగంటి తాగునీటి కటకటతో అల్లాడుతున్నారు. ట్యాంకర్ల బిల్లులు కూడా సకాలంలో చెల్లించక పోవడంతో నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.  
జల సంరక్షణ, భూగర్భజలాల పెంపునకు గత ప్రభుత్వం చేపట్టిన నీరు-ప్రగతి పనులు నిలిపేయడం అనాలోచిత చర్య. గతంలో చేసిన పనులకు బిల్లులు నిలిపేయడంతో కొత్త పనులు చేసేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితి వచ్చింది. రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు అనేకమార్లు పాలకులు మారినప్పటికీ ఎన్నడూ, ఎక్కడా పనులు ఆపిన దాఖలాలు లేవు. 

13నెలలుగా అన్ని జిల్లాలలో ప్రాజెక్టుల పనులు ఆగిపోవడంపై రైతుల్లో, ఇతర వర్గాల ప్రజల్లో తీవ్ర ఆవేదన నెలకొంది. గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంపై ఏడాదికి రూ14వేల కోట్లు ఖర్చుచేయగా, ఈ ఏడాది అందులో మూడో వంతు(రూ 4,700కోట్లు) కూడా ఖర్చు చేయకపోవడం రైతాంగ భవిష్యత్ ను ప్రశ్నార్ధకం చేస్తోంది. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు నిలిచిపోవడంతో నియోజకవర్గ రైతులకు అందాల్సిన ఫలితాలు దక్కడం లేదు. సరైన దిగుబడులు రాక, కనీస మద్దతు ధర లభించక టమాటా, కూరగాయల రైతులు, హార్టీకల్చర్, సెరికల్చర్ రైతాంగం ఇప్పటికే అప్పుల్లో కూరుకు పోయారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సత్వరమే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులతో సహా అన్ని జిల్లాలలో పెండింగ్ నీటి పారుదల ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని, రైతాంగాన్ని, ఇతర వర్గాల ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

అభినందనలతో

(నారా చంద్రబాబు నాయుడు).

Follow Us:
Download App:
  • android
  • ios