అమరావతి: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు అనుసరించిన వ్యూహాన్నే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో అనుసరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, లోకసభ ఏకకాలంలో ఎన్నికలు జరగనున్నాయి. 

తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టడం ద్వారా కేసిఆర్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించారని చంద్రబాబు భావిస్తున్నారు. అదే తరహాలో ప్రత్యేక హోదాను ఆసరా చేసుకుని ఆంధ్ర సెంటిమెంటును వాడుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. 

కేసిఆర్ కు సహకరిస్తూ ఎపి ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను చంద్రబాబు తప్పు పడుతున్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని ఆయన చెప్పదలుచుకున్నారు. ఈ తరహా ప్రచారాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. 

ఎపికి ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తున్న కేసిఆర్ కు పవన్ కల్యాణ్, జగన్ మద్దతిస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజనకు కారణమైన కేసిఆర్ పై ఎపి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చంద్రబాబు భావిస్తున్నారు. ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారని జగన్, పవన్ కల్యాణ్ ను విమర్శించడం ద్వారా ఎన్నికల్లో ప్రయోజనం పొందవచ్చుననేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. 

అదే తరహా ప్రచారాన్ని జగన్, పవన్ కల్యాణ్ లపై కొద్ది మంది టీడీపి నాయకులు కూడా ప్రారంభించారు. టీఆర్ఎస్ విజయంతో పవన్ కల్యాణ్, జగన్ ఎందుకు ఆనందిస్తున్నారని, ఆ పార్టీతో వారికి ఉన్న సంబంధం ఏమిటని టీడీపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. 

టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తూ జగన్ ఎపి ప్రజలను మోసం చేస్తున్నారని మంత్రి, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన జగన్ కు ఓ బహిరంగ లేఖ కూడా రాశారు. ఎపికి వ్యతిరేకంగా కుట్ర చేసిన, ఎస్సీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కేసిఆర్ కు ఎలా మద్దతిస్తారంటూ ఆయన జగన్ ను ప్రశ్నించారు.