అమరావతి: అభ్యర్థుల జాబితా ప్రకటన విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దారిలో నడవనున్నారు. ఎన్నికలకు చాలా ముందుగానే చంద్రబాబు కూడా అభ్యర్థుల జాబితాను వెల్లడించడానికి అవసరమైన కసరత్తు చేస్తున్నారు. 

శాసనసభను రద్దు చేసిన వెంటనే కేసిఆర్ 105 మంది పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందే చంద్రబాబు టీడీపి అభ్యర్థుల జాబితాను వెల్లడించే అవకాశం ఉంది. చంద్రబాబు ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేసే పనిలో ఉన్నారు. ఆశావహుల జాబితాను కూడా ఆయన విడిగా తయారు చేస్తున్నట్లు సమాచారం. 

ఎన్నికలకు సిద్ధం కావాలని, నియోజకవర్గాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయాలని ఆయన ఎమ్మెల్యేలను ఆదేశించారు. బిజెపి, వైఎస్సార్ కాంగ్రెసు కుమ్మక్కయ్యాయనే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లాలని ఆయన బుధవారం జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు సూచించారు. 

ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన చెప్పారు. ఒక్కో ఎమ్మెల్యే పనితీరుపై తాను చేయించిన సర్వే నివేదికలను చంద్రబాబు శాసనసభ్యులకు అందించారు. దాన్ని బట్టి తమ పనితీరుపై ఎమ్మెల్యేలకు ఓ అవగాహన వచ్చిందని అంటున్నారు.