చెడ్డ పేరు తేవద్దు: నారా లోకేష్ కు చంద్రబాబు సూచన

Chandrababu suggests Nara Lokesh
Highlights

ఎన్టీఆర్‌కు, తనకు ఎక్కడా చెడ్డపేరు తీసుకురావద్దని తన కుమారుడు లోకేష్‌కు చెప్పినట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. 

విజయవాడ: ఎన్టీఆర్‌కు, తనకు ఎక్కడా చెడ్డపేరు తీసుకురావద్దని తన కుమారుడు లోకేష్‌కు చెప్పినట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. మహానాడు ముగింపు ఉపన్యాసంలో మంగళవారం ఆయన ఆ విషయం చెప్పారు.  

వ్యాపారం చూసుకోవాలని ఉంటే వ్యాపారానికి వెళ్లాలని, రాజకీయాల్లోకి రావాలని ఉంటే రావాలని చెప్పినట్లు తెలిపారు.  తనే ఆలోచించుకుని రాజకీయాల్లోకి వచ్చాడని చెప్పారు. రాజకీయాల్లో ఉన్న నేతలు ప్రజల కోసం బతకాలని, కుటుంబం కోసమో, కొంతమంది వ్యక్తుల కోసమో కాదని సూచించానని అన్నారు. 
వారసత్వ రాజకీయాలు, భవిష్యత్ గురించి తాను మాట్లాడటం లేదని, సమర్థత ఉంటే నాయకులు రాణిస్తారని అన్నారు. ఒక మామూలు కుటుంబంలో పుట్టి నిరంతర శ్రమతో ఆ స్థాయికి తాను వచ్చినట్లు తెలిపారు. 

పరిటాల రవిని చంపినప్పుడు కూడా తాను సహనం కోల్పోలేదని అన్నారు. తోటపల్లి ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వకుండా పుష్కరాలకు ఖర్చుపెట్టామంటూ విమర్శలు చేస్తున్నారని, కాని ప్రకృతిని ఆరాధించటం మన సంస్కృతి అని తెలిపారు. 

తప్పుడు సమాచారాన్ని పదేపదే చెప్తే ప్రజలు భ్రమపడతారని అనుకుంటున్నారని ఆయన ప్రతిపక్షాలను విమర్శించారు. మహిళలపై దౌర్జన్యాలకు దిగితే ఉరికంబం ఎక్కిస్తామని స్పష్టం చేశారు. త్వరలో నిరుద్యోగభృతి అమలు చేస్తామని తెలిపారు.

loader