రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై పార్టీలో పెరుగుతున్న నిరసన స్వరాలను గమనించిన చంద్రబాబు వివరణ ఇచ్చారు. సిఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్లను రాజ్యసభ అభ్యర్ధులుగా చంద్రబాబు ఎంపిక చేశారు. రెండు పేర్లపైనా ఈసారి నేతల్లో పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాంతో చంద్రబాబు సోమవారం కనకమేడల ఎంపికపై వివరణ ఇచ్చారు.

సోమవారం అసెంబ్లీలో సీఎం మీడియాతో మాట్లడుతూ, పార్లమెంట్‌లో అన్ని పార్టీలకూ అడ్వకేట్లు ఎంపీలుగా ఉన్నారని చెప్పారు. ఒక్క టీడీపీకి మాత్రమే ఇంతవరకు లేరట. అందుకే రాజ్యసభకు కనకమేడల రవీంద్రకుమార్‌ పేరును ఖరారు చేశామన్నారు. గడిచిన 20 ఏళ్లుగా ఆయన పార్టీలో కొనసాగుతున్నారని టీడీపీకి సంబంధించిన అన్ని కేసులను ఆయనే చూస్తున్నట్లు సిఎం తెలిపారు.

నిజానికి గతంలోనే రవీంద్రకుమార్‌కు ఎమ్మెల్సీ ఇద్దామనుకున్నారట. కానీ అనివార్య కారణాలవల్ల కుదరలేదన్నారు. ‘రవీంద్ర చేస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు టికెట్‌ ఇచ్చాం’ అని చంద్రబాబు సమర్ధించుకున్నారు.