అమరావతి: బెయిల్ పై జైలు నుంచి విడుదలైన తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. వైసీపీ పెట్టిన అక్రమ కేసులన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన చింతమనేనికి సూచించారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే అనేక కేసులు పెట్టారని, పనిగట్టుకుని ఐదు నెలల కాలంలో చింతమనేనిపై 11 కేసులు పెట్టారని చంద్రబాబు అన్నారు. తొమ్మిది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం కన్నా అన్యాయం మరోటి ఉండనదని ఆయన అన్నారు. 

Also Read: నా తప్పని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా...

తమ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చంద్రబాబు చింతమనేనికి భరోసా ఇచ్చారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో కలుద్దామని చంద్రబాబు చింతమనేనికి చెప్పారు.

చింతమనేని ప్రభాకర్ పై 18 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరైంది. దీంతో చింతమనేని ప్రభాకర్ 65 రోజుల తర్వాత ఏలూరు సబ్ జైలు నుంచి శనివారం సాయంత్రం విడుదలయ్యారు.