హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు గత ఆరు నెలలుగా ఇబ్బందులు ఎదురవుతూ వస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితోనూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతోనూ ఎన్టీఆర్ కు రాజకీయ విభేదాలే కారణమని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. 

తన తనయుడు నారా లోకేష్ ను తన వారసుడిగా నిలబెట్టాలనే చంద్రబాబు ప్రయత్నాలకు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాకుండా ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ కూడా అడ్డు తగులుతూ వచ్చారు. ఈ క్రమంలోనే చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను దూరం చేసుకున్నారనేది అందరూ అంగీకరించే విషయమే.                                       

                                            

ఆ కారణంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు విడుదలైన ప్రతిసారీ ఆంధ్రలో ఏదే విధమైన వివాదాలు చుట్టుముడుతూ వచ్చాయి. దమ్ము సినిమా విడుదల సమయంలో ఎన్టీఆర్ కు, బాలయ్యకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడిచింది. అప్పటి నుంచి బాలయ్య ఎన్టీఆర్ ను దూరం పెడుతూ వచ్చారు. బాలయ్య అభిమానులు కూడా ఎన్టీఆర్ కు మద్దతు పలకడం మానేశారు.  

ఆ సమయంలో ఎస్ఎంఎస్ ల యుద్ధం కూడా నడిచింది. దమ్ము సినిమాకు వ్యతిరేకంగా ఆ సమరం సాగింది. ఆ సినిమా బెనిఫిట్ షోలకు అనుమతులు కూడా ఇవ్వలేదు. బాద్ షా సినిమా విడుదల సమయంలో ఎన్టీఆర్ పెద్ద నిందనే మోయాల్సి వచ్చింది.

కొడాలి నాని తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెసులో చేరడానికి ఎన్టీఆర్ కారణమనే విమర్శలు వచ్చాయి. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, క్యాడర్ ఎన్టీఆర్ కు దూరమయ్యారు. కొడాలి నాని పార్టీ మారడానికి తాను కారణం కాదని మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పినా ఫలితం లేకుండా పోయింది. 

                                          

ఆ సమయంలో ఎన్టీఆర్ పై ఒక ప్రముఖ ఛానెల్ పిల్లకాకి అని ఒక బులెటెన్ కూడా ప్రసారం చేసింది. ఇది నారా లోకేష్ పనేనని ప్రచారం కూడా జరిగింది. ఆతర్వాత ఎన్టీఆర్ అబిమానులు ఆ ఛానెల్ పై రాళ్లు కూడా విసిరారు.

 దాంతో  బాలయ్య అభిమానులు పూర్తిగా ఎన్టీఆర్ కు దూరమయ్యారు.

దమ్ము సినిమా నుండి ఇప్పటి వరకు ఎన్టీఆర్ సినిమాలకు ఆంధ్రాలో బెనిఫిట్ షోలు ఇవ్వలేదు. కానీ ఆరు షోలకు అనుమతి ఇచ్చారు. మామూలుగా నాలుగు షోలు మాత్రమే ఉంటాయి. కానీ అదనంగా రెండు షోలకు అనుమతి ఇచ్చారు. బెనిఫిట్ షోలకు కూడా అనుమతి ఇచ్చారు.

                                         

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోసం చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేతకు ఆ విధమైన సదుపాయాలు కల్పిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. చంద్రబాబు అనుమతి లేకుండా ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చి ఉంటారని అనుకోవడానికి లేదు. చంద్రబాబు మారిన వైఖరి వల్లనే ఆ విధమైన అదనపు ఏర్పాట్లు అరవింద సమేత ప్రదర్శనకు కలిగాయనే అభిప్రాయమే బలంగా ఉంది.

నందమూరి హరికృష్ణ మృతితో నందమూరి కుటుంబంలో వాతావరణం కాస్తా మారినట్లు కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తో బాలయ్య సన్నిహితంగా మెలగడంతో ఇరువురు ఒక్కటయ్యారనే భావన ఏర్పడింది. 

హరికృష్ణ మృతి వల్ల ఎన్టీఆర్ పై సానుభూతి ఒక్కటి ఉంటుందనే విషయం కాదనలేని విషయం. ఈ తరుణంలో ఎన్టీఆర్ పట్ల కఠినంగా వ్యవహరించడం మంచిది కాదనే అభిప్రాయం కూడా చంద్రబాబుకు కలిగి ఉండవచ్చు. మొత్తం మీద, చంద్రబాబు ఎన్టీఆర్ పట్ల కాస్తా సానుకూలమైన అభిప్రాయం ఏర్పడిందని మాత్రం చెప్పవచ్చు.