Asianet News TeluguAsianet News Telugu

రోడ్డు కావాలని స్కూల్ విద్యార్థుల నిరసన.. ప్రజాసమస్యలపై ఈగో వద్దు జగన్ రెడ్డి అంటూ చంద్రబాబు ట్వీట్

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలోని లింగాపురం గ్రామానికి చెందిన విద్యార్థులు వరాహ నది నీటిలో చేతులు జోడించి నిలబడి రోడ్డు వేయాలని సీఎం జగన్‌కు, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. 

Chandrababu slams YS Jagan Over Narsipatnam Lingapuram village students protest in water for road construction
Author
First Published Oct 20, 2022, 4:49 PM IST

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలోని లింగాపురం గ్రామానికి చెందిన విద్యార్థులు వరాహ నది నీటిలో చేతులు జోడించి నిలబడి రోడ్డు వేయాలని సీఎం జగన్‌కు, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించి మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందించారు. చివరికి చిన్న పిల్లలు సైతం వంతెన అప్రోచ్ రోడ్డు కోసం నిరసనల బాట పట్టే స్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని సీఎం జగన్‌పై చంద్రబాబు మండిపడ్డారు. ప్చ్.. సీఎం జగన్‌కు ఎలా చెబితే అర్థం అవుతుందో ఎవరికీ అర్థం కావడం లేదని అన్నారు. 

‘‘నర్సీపట్నంలో వరాహ నదిపై మా ప్రభుత్వ హయాంలోనే వంతెన నిర్మించాం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పెండింగ్ లో ఉన్న ఆ కాసింత అప్రోచ్ రోడ్డు పనులు కూడా పూర్తిచేయలేదు. దీంతో మోడల్ స్కూల్ కు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లలో దిగి తమ కష్టం తీర్చాలని వేడుకుంటున్నారు. ఈ ముఖ్యమంత్రి తన పాలనలో కొత్తగా ఏమీ కట్టలేరని ప్రతి ఒక్కరికి తెలుసు.. కనీసం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేసినా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రజా సమస్యలపై ఈగో వద్దు జగన్ రెడ్డీ... ఇష్యూను సాల్వ్ చేయండి’’ అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. 

ఇక, లింగాపురం గిరిజన గ్రామం 6వ తరగతి ఆపైన విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాలంటే బలిఘట్టం, వేములపూడి లేదా నర్సీపట్నం వెళ్లాల్సి వస్తోంది. గ్రామస్తులు కూడా ఏ అవసరం వచ్చినా నర్సీపట్నం రావాల్సిందే. దీంతో వరాహ నదిపై వంతెనను నిర్మించారు. అయితే వంతెన దాటిన తర్వాత లింగాపురం వెళ్లే వారు దాదాపు కిలోమీటరు మేర కచ్చా రోడ్డులో ప్రయాణించాల్సి వస్తోంది. ఒక రైతు వ్యాజ్యం కారణంగా నదిపై వంతెనతో అనుసంధానించే రోడ్డు కొంత విస్తీర్ణం ఇంకా పూర్తి కాలేదు. దీంతో విద్యార్థులు తమ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు నది దాటాల్సి వస్తోంది.

 

ఈ క్రమంలోనే లింగాపురం  గ్రామస్తులు కొద్ది రోజులుగా వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు నీటిలో దిగి.. అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సీఎం జగన్‌ను, అధికారులను వేడుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో పిల్లలు.. ‘‘జగన్ మామయ్య గారు మా ఊరికి రోడ్డు వేయండి.. మీకు దండాలు పెడతాం’’ అని అనడం వినిపిస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios