Asianet News TeluguAsianet News Telugu

ఉత్తుత్తి ప్రకటనలు మానుకోవాలి.. నిందితులకు శిక్షపడేలా చూడాలి: సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మహిళలపై నేరాలను అరికట్టే విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ది ప్రకటనలకే పరిమితం అవుతుందని విమర్శించారు.

Chandrababu Slams YS Jagan Over Crime Against Women
Author
First Published Oct 9, 2022, 3:00 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మహిళలపై నేరాలను అరికట్టే విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ది ప్రకటనలకే పరిమితం అవుతుందని విమర్శించారు. కాకినాడలో దేవిక హత్య విషయంలో చట్టమే లేని దిశా చట్టం ప్రకారం నిందితులపై చర్యలు అంటూ స్వయంగా సీఎం ప్రకటనలు చెయ్యడం మోసగించడమేనని అన్నారు. సీఎం, ప్రభుత్వం ఇలాంటి ఉత్తుత్తి ప్రకటనలు మాని... నిందితులకు వెంటనే శిక్షపడేలా చూడాలని కోరారు. 

ఈ మేరకు చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నప్పుడే నేరస్థులకు భయం.. మహిళలకు నమ్మకం కలుగుతుందని దఅన్నారు. కొత్త చట్టాలు కాదు.. కనీసం ఉన్నచట్టాల ప్రకారం కూడా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. 

అదే గుంటూరు జిల్లాలో అత్యాచారం కేసుపెట్టిన వివాహిత ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని అన్నారు. ఇలాంటి ఘటనలు చూస్తే.. మహిళలపై నేరాల విషయంలో ప్రభుత్వం ఎంత అలసత్వంతో ఉందో అర్థం అవుతుందని ట్వీట్ చేశారు. ఈ ఘటనలకు సంబంధించిన వార్త పత్రికల క్లిప్పింగ్స్‌ను కూడా చంద్రబాబు షేర్ చేశారు.

కాకినాడలో దేవిక దారుణ హత్య.. 
తనను ప్రేమించి.. పెళ్లికి నిరాకరించిందనే కారణంతో దేవిక అనే యువతిని సూర్యనారాయణ అనే యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఆమెను వెంబడించి.. నడిరోడ్డుపై అతి కిరాతకంగా హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు దేవిక స్వగ్రామం కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం కె గంగవరం. కరప మండలం కూరాడ గ్రామంలోని అమ్మమ్మ కొప్పిశెట్టి చంద్రమ్మ వద్ద ఉంటూ డిగ్రీ పూర్తి చేసింది. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించేందుకు కృషి చేస్తుంది. మరోవైపు రంగంపేట మండలం బాలవరం గ్రామానికి చెందిన గుబ్బల వెంకట సూర్యనారాయణ. కూడా కూరాడలోని తన అమ్మమ్మ ఇంటివద్ద ఉంటున్నాడు. అయితే కొంతకాలంగా వీరిద్దరి మధ్య పరిచయం ఉంది. వీరిద్దరి ప్రేమ గురించి తెలిసిన కుటుంబ సభ్యులు పెళ్లి ప్రయత్నాలు చేశారు. 

వారిద్దరి పెళ్లిని జరిపించాలని కుటుంబ సభ్యులు అనుకున్నప్పటికీ అది కుదరలేదు. సూర్యనారాయణకు తమ కూతురిని ఇచ్చేందుకు దేవిక కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈ క్రమంలోనే దేవిక కానిస్టేబుల్ ఉద్యోగ సన్నాహకాలపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. సూర్య నారాయణకు దూరంగా ఉండటం మొదలుపెట్టింది. దేవిక మరొకరితో సన్నిహితంగా తిరుగుతున్నట్లు సూర్యనారాయణ అనుమానించాడు. తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించినందుకు ఆమెపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే దేవిక కదలికలపై నిఘా ఉంచాడు. 

సూర్యనారాయణ ఆమెపై దాడి చేసేందుకు యాసిడ్ బాటిల్, కత్తిని కొనుగోలు చేసిశారు. శనివారం జి మామిడాల నుంచి తిరిగి వస్తుండగా ఆమెపై దాడి చేశాడు. పెదపూడి మండలం కూరాడ-కాండ్రేగుల రహదారిపై శనివారం పట్టపగలు దేవిక బైక్‌ను అడ్డగించి ఆమె గొంతు కోశాడు. ఇది గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా.. అది ఘటన స్థలానికి చేరుకునేలోపే బాలిక మృతి చెందింది.  దేవికపై దాడి చేసిన వెంటనే స్థానికులు నిందితుడిని పట్టుకుని కట్టేసి కొట్టారు. అనంతరం పెదపూడి పోలీసులకు సమాచారం అందించగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల సాయం ప్రకటించిన సీఎం జగన్.. 
ఈ దారుణ హత్యపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేవిక కుటుంబానికి అండగా నిలవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇక, దేవిక కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. నిందితుడిని దిశ చట్టం కింద శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. గడువులోగా విచారణ పూర్తి చేసి ఛార్జిషీటు దాఖలు చేయాలని చెప్పారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios