అమరావతి: కర్నూలులో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మాజీమంత్రి కోట్లసూర్యప్రకాశ్ రెడ్డి  కుటుంబాల మధ్య నెలకొన్న అసమ్మతికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫుల్ స్టాప్ పెట్టారు. కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని నేతలతో శుక్రవారం సాయంత్రం సమావేశమైన చంద్రబాబు టికెట్ల కేటాయింపులపై చర్చించారు. 

సీట్ల విషయంపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో విడిగా మాట్లాడారు. ఇప్పటికే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం టీడీపీలో రావడాన్ని వ్యతిరేకిస్తున్న కేఈని బుజ్జగించారు చంద్రబాబు. అయితే కేఈ డిమాండ్లపై ఆరా తీశారు. కేఈ కృష్ణమూర్తి కోరినట్లే పత్తికొండ, డోన్ నియోజకవర్గాలను ఆయన కుటుంబానికే ఖరారు చేశారు. 

అనంతరం కోట్ల కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపై కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో చర్చించారు. అంతా సుముఖత వ్యక్తం చెయ్యడంతో కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా కేంద్ర కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పోటీ చేసే అంశంపై కూడా చర్చించారు. 

పార్టీలోని నేతలు చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. దీంతో కేంద్రమాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబానికి కర్నూలు పార్లమెంట్, ఆలూరు అసెంబ్లీ సీట్లను ఖరారు చేశారు. 

కర్నూలు పార్లమెంట్ నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఆలూరు నియోజకవర్గం నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సతీమణి కోట్ల సుజాతమ్మ పోటీ చెయ్యనున్నారు. కేఈ కుటుంబం, కోట్ల కుటుంబాలు రాజీకి రావడంతో జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.