ఏవీ సుబ్బారెడ్డికి షాక్.. అఖిల ప్రియ పేరు తొలగింపు

chandrababu serious on minister akhila priya and av subba reddy
Highlights

ఇద్దరినీ అమరావతికి పిలిచిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, దివంగత భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి పై జరిగిన రాళ్ల దాడి కేసు మరో మలుపు తిరిగింది. మంత్రి అఖిలప్రియ ఆదేశాలతోనే దాడి జరిగిందని ఆరోపిస్తూ సుబ్బారెడ్డి ఫిర్యాదుచేయగా.. పోలీసులు మాత్రం అనూహ్యంగా మంత్రి పేరును తొలగించారు. బాధితుడి ఫిర్యాదును పక్కనపారేసి, పోలీసులనే సాక్ష్యులుగా పేర్కొంటూ మరో కేసు నమోదు చేశారు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కేసును నీరుగార్చేప్రయత్నం చేస్తున్నారని ఏవీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ సుబ్బారెడ్డి సోమవారం కూడా తన సైకిల్‌ యాత్రను కొనసాగిస్తున్నారు.

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీకే చెందిన మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య చాలా కాలంగా విబేధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఏవీ సుబ్బారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా సైకిల్‌ ర్యాలీని చేపట్టారు. ర్యాలీగా వెళుతోన్న సుబ్బారెడ్డిపై కొందరు రాళ్లదాడికి పాల్పడ్డారు. మంత్రి అఖిలప్రియ అనుచరులే తనపై దాడికి పాల్పడ్డారంటూ ఏవీ ఫిర్యాదు చేశారు. కాగా.. అఖిలప్రియ పేరు తొలగించి పోలీసులు కేసు నమోదుచేయడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి ల మధ్య వైరం  ముదిరి పాకాన పడుతుందన్న విషయాన్ని చంద్రబాబు గ్రహించారు. ఇప్పటికే ఈ విషయంలో ఇద్దరికీ నచ్చచెప్పిన చంద్రబాబు.. మరోసారి ఈ విషయంపై వీరిద్దరితో చర్చించేందుకు వారిని అమరావతికి రావాల్సిందిగా ఆదేశించారు.

loader