అమరావతి: ప్రజలకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం లేదని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు విమర్శించారు. ప్రతి విషయంలోనూ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందన్నారు. 

గురువారం నాడు అమరావతిలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. లాక్ డౌన్ పెట్టిన తర్వాత ఏపీకి రూ. 8 వేల కోట్లు ఇచ్చినట్టుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  ప్రకటించారన్నారు.ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వినియోగించలేదని ఆయన విమర్శించారు. 

also read:రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచడమే గుడ్ గవర్నెన్సా: బాబుపై బొత్స సెటైర్లు

ప్రతి కుటుంబానికి కనీసం రూ. 5 వేలు చొప్పున ఇవ్వాలని కోరినా కూనడ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. కరోనా కిట్లు, బ్లీచింగ్ కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. 108, 104 అంబులెన్స్ ల కొనుగోళ్లలో భారీ అక్రమాలు చోటు చేసుకొన్నాయన్నారు. విజయసాయిరెడ్డి పుట్టిన రోజు కానుకగా రూ. 307 కోట్లు కట్టబెట్టారన్నారు.

అనుభవం ఉన్న సంస్థను పక్కన పెట్టి విజయసాయి రెడ్డి వియ్యంకుడికి 108 అంబులెన్స్ ల నిర్వహణ కాంట్రాక్టు ఇచ్చారని ఆయన ఆరోపించారు. కరోనాకు సంబంధించి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి పబ్లిసిటీతో మనుగడ సాధించాలని చూస్తున్నారన్నారు. 

టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడిని బలవంతంగా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. అనారోగ్యంగా ఉందని చెప్పినా కూడ బలవంతంగా డిశ్చార్జ్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అచ్చెన్నాయుడు ఎలాంటి తప్పు చేయకపోయినా అనేక విధాలుగా వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతోంటే ప్రజలకు మేలు చేసే దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన మండిపడ్డారు.