అమరావతి: ప్రలోభాలకు లొంగకుండా పార్టీ మారని నేతలపై కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించారు.

ఆదివారం నాడు ఆయన పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఆయన చర్చించారు.రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గాలకు అంతు లేకుండా పోయిందన్నారు. ప్రజాదరణ ఉన్న రాజకీయ కుటుంబాలపై సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగాడని ఆయన ఆరోపించారు. ప్రలోభాలకు లొంగకపోతే పగసాధిస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారన్నారు.

ఇందులో భాగంగానే అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిల అరెస్ట్ లు అంటూ ఆయన గుర్తు చేశారు.

వైసీపీ ప్రభుత్వ దుశ్చర్య వల్లే అచ్చెన్నాయుడికి మళ్లీ ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అచ్చెన్నాయుడు ఘటనపై మానవ హక్కుల కమిషన్‌ కు కూడ ఫిర్యాదు చేస్తామని చంద్రబాబు చెప్పారు.

కోర్టు తీర్పులతో జగన్ లో అసహనం రెట్టింపైందన్నారు. తాను జైలుకు వెళ్లారు కాబట్టే అందరూ కూడ జైలుకు వెళ్లాలనేది జగన్ అక్కసంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తప్పుడు ఫిర్యాదులు, నకిలీ పత్రాలు పెట్టి మరీ అరెస్టులు చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ పనుకుల జగన్ కంపెనీ సిమెంట్ కొనాలా? స్వంత మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు సిబ్బందికి ప్రభుత్వ జీతాలా ఇంతకన్నా అధికార దుర్వినియోగం ఉంటుందా అని ఆయనప్రశ్నించారు.

రాజ్యాంగంపై ప్రమాణం చేసి సీఎంగా ప్రమాణం చేసిన జగన్ రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని బాబు చెప్పారు.రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని ప్రమాణం చేసిన జగన్ ఇప్పుడు స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారన్నారు.

వైసీపీ కండువా వేసుకొంటే వందల కోట్లు జరిమానాలను రద్దు చేస్తున్నారని... వైసీపీకి లొంగకపోతే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.నేరగాళ్లకు తాము భయపడే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.