అమరావతి: జగన్, కేసీఆర్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల్లో కేసీఆర్ నిధులు పంపితే ఏపీ రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తెలంగాణకు తాకట్టు పెట్టారని చంద్రబాబు విమర్శించారు. 

గురువారం సాయంత్రం అమరావతిలో చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ ఐదేళ్ల కాలంలో తాము ఏం చేయనున్నామో చెప్పకుండా గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

శాసనసభ హుందాతనం దెబ్బతినేలా వైసీపీ ప్రయత్నిస్తోందని  ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత చంద్రబాబునాయుడు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుపై విషం కక్కుతున్నారని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. 

గత ఐదేళ్లలో  తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు కేంద్రం అనేక అవార్డులు ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.వంశధార, తోటపల్లి ప్రాజెక్టుల విషయమై జగన్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు.  

గతంలో కృష్ణా, గోదావరి నది జలాలను వాడుకొనే  విషయమై కేసీఆర్‌పై జగన్  చేసిన విమర్శలను చంద్రబాబు గుర్తు చేశారు. ఈ మేరకు కేసీఆర్ పై జగన్ విమర్శల వీడియో క్లిప్పింగ్ ను మీడియా సమావేశంలో బాబు మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ఇవాళ ఏపీ అసెంబ్లీలో జగన్ చేసిన ప్రసంగం వీడియో క్లిప్పును కూడ చూపించారు.

ఎగువన ఉన్న రాష్ట్రం నుండి కిందకు నీళ్లు రావని జగన్ చెప్పడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు.  ఏపీ రాష్ట్రానికి రాష్ట్రం వాటాను వాడుకోవచ్చన్నారు. అవినీలిపై జగన్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.

నోరు ఉందని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడకూడదని జగన్ ను చంద్రబాబు హెచ్చరించారు. ప్రాజెక్టులపై అవగాహన లేకుండా జగన్ మాట్లాడుతున్నారని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. సీఎం చిల్లరగా వ్యవమరించకూడదని ఆయన హితవు పలికారు.