తెలంగాణలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 

విజయవాడ: తెలంగాణలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలన అంతా అవినీతిమయమని ఆరోపించారు. వైఎస్‌ హయాంలో రాష్ట్రం అప్రతిష్ట పాలైందని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రతి అరగంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడని చంద్రబాబు ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా విభజించారని ముఖ్యమంత్రి విమర్శించారు. తెలుగుదేశం మహానాడులో చంద్రబాబు ఆదివారంనాడు ప్రారంభోన్యాసం చేశారు. పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. 

తనపై నమ్మకంతోనే గత ఎన్నికల్లో ప్రజలు గెలిపించారని అన్నారు. తమ కష్టాలు తాత్కాలికమేనని, సమస్యలను అవకాశంగా మలుచుకున్నామని చెప్పారు. 2022 నాటికి మూడు అగ్రరాష్ట్రాల్లో ఏపీ ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

విభజన కష్టాలు, సమస్యలతో అభివృద్ధి దీక్ష చేపట్టామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే విద్యుత్‌ లోటును అధిగమించామని అన్నారు. భవిష్యత్‌లో కరెంట్ చార్జీలు పెంచబోమని ప్రకటించిన రాష్ట్రం ఏపీనే అని అన్నారు. 

కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని అన్నారు. ఎక్కడా లేనివిధంగా సంక్షేమపథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. 208 రోజులపాటు పాదయాత్రలో ప్రజల కష్టాలు దగ్గర నుంచి చూశానని అన్నారు.

ఇచ్చిన హామీల కన్నా ఎక్కువగా అమలుచేశామని చంద్రబాబు. కార్పొరేషన్‌ ద్వారా అగ్రవర్ణాల పేదలను ఆదుకుంటున్నామని అన్నారు. కాంగ్రెస్‌ హాయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు పక్కదారి పట్టించారని ఆరోపించారు. 

బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించామని, అలాగే ఎప్పుడూ లేనంతగా బడ్జెట్‌లో మైనార్టీలకు నిధులు పెంచామని చంద్రబాబు అన్నారు.