హైదరాబాద్: తెలుగు సినీ రంగంలో ఇప్పుడు బయోపిక్ ల హవా నడుస్తోంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితంపై నిర్మితమవుతున్న యాత్ర సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాత్ర ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొని ఉంది.

ఈ సినిమాకు మహి వీ రాఘవ దర్శకత్వం వహించారు. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో వైఎస్‌గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
 
వైఎస్సార్ రాజకీయ ప్రత్యర్థిచంద్రబాబు పాత్ర ఈ సినిమాలో ఎవరు పోషించారనే ప్రశ్నకు దర్శకుడు ఊహించని సమాధానం ఇచ్చారు. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడి పాత్ర లేదని ఆయన చెప్పారు. వైఎస్‌ఆర్ గారి గురించి చెప్పడం కోసం ఇతరులను తక్కువ చేయాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. 

జగన్ క్యారెక్టర్ కూడా సినిమాలో లేదని, కేవలం రెండు నిమిషాల కోసం ఆయన పాత్ర పెట్టి ప్రేక్షకులను తికమక పెట్టడం మంచిది కాదని ఆయన అన్నారు. కానీ ఇందులో కొన్ని కల్పిత పాత్రలు మాత్రం ఉన్నాయని తెలిపారు.  ఫిబ్రవరి 8వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.