విజయవాడ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిది వన్ సైడ్ లవ్ అని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు మరోసారి మోసాలకు తెరతీశారని ఆయన అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ కొత్తగా అనేక హామీలు ఇస్తూ జిమ్మిక్కులు చేస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. అగ్రకులాల పేదలకు కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లలో 5శాతం కాపులకు ఇస్తామంటూ చంద్రబాబు మరోసారి మోసం చేయడానికి కుట్ర పన్నుతున్నారని అన్నారు. కులానికో హామీ ఇచ్చి తుంగలో తొక్కారని ఆయన అన్నారు. 

కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మోసాలపై కాంగ్రెస్‌, జనసేన పార్టీలు స్పందించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు తన అవసరాల కోసం ఎవరు కనబడితే వారితో పొత్తుకు సిద్ధపడుతున్నారని ఆయన అన్నారు.. చంద్రబాబుతో పొత్తుపెట్టుకునేవారు మునిగిపోవడం ఖాయమని ఎద్దేవా చేశారు.