పవన్ కల్యాణ్ తోనే కుట్ర మొదలు: చంద్రబాబు ఫైర్

Chandrababu replies to Pawan Kalyan
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు.

విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. తోటపల్లి రిజర్వాయర్ కు నిధులు ఇవ్వలేదని కొంత మంది విమర్శలు చేస్తున్నారని ఆయన పవన్ కల్యాణ్ చేసిన విమర్శపై అన్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాలకు నిధులు ఇస్తే తప్పా అని ఆయన పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు.

మీరు సహకరించారు, ధన్యవాదాలు తెలిపామని ఆయన పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి అన్నారు. పవన్ కల్యాణ్ మనం గెలువలేదని అన్నారు. పవన్ కల్యాణ్ మనం బిజెపితో తెగదెంపులు చేసుకున్న తర్వాత మనలను లక్ష్యం చేసుకున్నారని, అక్కడే కుట్ర ప్రారంభమైందని ఆయన అన్నారు. 

తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆయన మంగళవారం సాయంత్రం మాట్లాడారు. జాతీయ పార్టీలు బలహీపడ్డాయని, బిజెపి పూర్తిగా బలహీనపడిందని, ప్రాంతీయ పార్టీలు బలపడ్డాయని ఆయన అన్నారు. ఆ రోజు మోడీ మాయమాటలు చెప్తే నమ్మామని అన్నారు. నాలుగేళ్లలో నిరాశనే మిగిలిందని, కేంద్రం నమ్మకద్రోహం చేసిందని అన్నారు. మోడీ ప్రభుత్వంతో లాభం లేదని తేలిపోయిందని అన్నారు. 

రాజకీయ ప్రయోజనాలకోసం, వ్యక్తిగత ప్రయోజనం కోసం ఉపయోగించుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి గెలువదని అన్నారు. ఎన్డీఎ ప్రభుత్వం కేంద్రంలో రాదని అన్నారు. అన్ని తప్పులు చేసిన బిజెపికి ఓటేస్తారా, ప్రజలు ఎందుకు ఓటేస్తారని ఆయన అడిగారు. 

విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి సమాజానికి కలుషితం చేశారని, అవినీతిపరులను పక్కన పెట్టుకుని సమాజానికి తప్పుడు సంకేతాలు ఇచ్చారని అన్నారు. టీడీపి ఎప్పుడు అధికారం కోసం పనిచేయలేదని అన్నారు. ప్రధాని పదవిని గతంలో వదులుకున్నానని ఆయన అన్నారు. ఉదాత్త లక్ష్యాన్ని నెరవేర్చాలంటే ఇక్కడ దృష్టి పెట్టాల్సి ఉందని, ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నానని అన్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వస్తాయని చెప్పారు.

బిజెపికి ఇక్కడ ఒక్క సీటైనా వస్తుందా అని అడిగారు. వారి పార్టీ వల్ల మనం గెలిచామని అంటున్నారని, బిజెపితో పొత్తు పెట్టుకోకపోతే మరో 20 సీట్లు వచ్చేవని, రాష్ట్రం కోసం బిజెపితో పొత్తు పెట్టుకున్నామని ఆయన అన్నారు.  

ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి బోనులో నిలబడి బయటికి వచ్చిన తర్వాత తనపై విమర్శలు చేస్తున్నారని, అది తనను బాధపెడుతోందని ఆయన జగన్ ను ఉద్దేశించి అన్నారు. ప్రజల కోసం ఆ బాధను భరిస్తున్నానని అన్నారు. నీతపరుడు విమర్శిస్తే ఫరవాలేదు గానీ కోర్టుకు వెళ్లి బోనులో నిలబడే వ్యక్తి తిడుతుంటే బాధేస్తుందని అన్నారు. 

తెలంగాణలో టీడీపికి ఢోకా లేదని అన్నారు. తాను నలబై ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేశానని అన్నారు. వ్యక్తిగత, రాజకీయ జీవితాల్లో క్రమశిక్షణతో ఉన్నానని, యేటా తన ఆస్తులను ప్రకటిస్తున్నానని చంద్రబాబు అన్నారు.

loader