ప్రకాశం: టిడిపి వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్బంగా ఏపీలో విషాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ పరిధిలోని  దర్శి మండలం శామంతపూడి గ్రామంలో టిడిపి జెండాను ఏర్పాటుచేస్తుండగా ప్రమాదం జరిగింది. జెండా కోసం ఉపయోగించే ఇనుప స్తంభం విద్యుత్ వైర్లకు తాకడంతో టిడిపి కార్యకర్త  వెంకట నారాయణ మృతిచెందాడు.

ఈ విషాద సంఘటన గురించి తెలిసిన టిడిపి జాతీయాధ్యక్షులు చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడు నారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారికి అత్యున్నత వైద్యం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. ఎన్టీఆర్ వర్ధంతినే ఈ దుర్ఘటన జరగడం కలిచివేసిందన్నారు. మృతుడు వెంకట నారాయణ కుటుంబానికి పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. 

read more ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో అపశృతి.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు..

ఈ దుర్ఘటనపై టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ కూడా స్పందించారు. ఎన్టీఆర్ గారి వర్థంతి సందర్భంగా జెండా స్తంభాన్ని నిలబెట్టే క్రమంలో కరెంట్ షాక్ కు గురై కార్యకర్త మద్దినేని వెంకటనారాయణ చనిపోవడం, మరో ఇద్దరు కార్యకర్తలు గాయపడటం బాధాకరమన్నారు. మద్దినేని వెంకటనారాయణ మృతికి సంతాపం... వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంకటనారాయణ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు.

కార్యకర్త మరణంపై ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పందించారు. ''విద్యుత్ తీగలు తగిలి తెలుగుదేశం కార్యకర్త మృతి చెందడం బాధాకరం. కార్యకర్త మృతి పార్టీకి తీరని లోటు. అన్న ఎన్టీఆర్  వర్ధంతి సందర్భంగా  తెలుగుదేశం జెండా ఆవిష్కరిస్తున్న సమయంలో జెండా స్తంభానికి విద్యుత్ తీగలు తగిలాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్యకర్త మృతి చెందాడు. ఇద్దరికి గాయాలయ్యాయి. అన్నగారి వర్ధంతి రోజున కార్యకర్త చనిపోవడం కలిచివేసింది. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం. మృతుడి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. వారిని అన్ని విధాలా ఆదుకుంటాం. గాయపడిన కార్యకర్తలకు మెరుగైన  వైద్యం అందేలా చర్యలు తీసుకుంటాం'' అన్నారు అచ్చెన్నాయుడు.