ప్రకాశం జిల్లా దర్శి మండలం నిమ్మారెడ్డి పాలెంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి చేస్తున్న ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీ జెండాలు కడుతూ కరెంట్ షాక్‌తో మద్దినేని వెంకటనారాయణ (30) అనే వ్యక్తి మృతి చెందాడు. వెంకటనారాయణ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ప్రకాశం జిల్లా దర్శి మండలం నిమ్మారెడ్డిపాలెంలో విద్యుత్ తీగలు తగిలి తెలుగుదేశం కార్యకర్త మృతి చెందడం బాధాకరమని, కార్యకర్త మృతి పార్టీకి తీరని లోటు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. 

ఎన్టీఆర్  వర్ధంతి సందర్భంగా  తెలుగుదేశం జెండా ఆవిష్కరిస్తున్న సమయంలో జెండా స్తంభానికి విద్యుత్ తీగలు తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్యకర్త మృతి చెందాడు. ఇద్దరికి గాయాలయ్యాయి. 

ఈ ఘటన మీద అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అన్నగారి వర్ధంతి రోజున కార్యకర్త చనిపోవడం కలిచివేసింది. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం. మృతుడి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. వారిని అన్ని విధాలా ఆదుకుంటాం. గాయపడిన కార్యకర్తలకు మెరుగైన  వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

కార్యకర్త మృతిపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. కరెంట్ షాక్ కు గురై కార్యకర్త మద్దినేని వెంకటనారాయణ చనిపోవడం, మరో ఇద్దరు కార్యకర్తలు గాయపడటం బాధాకరమన్నారు. మద్దినేని వెంకటనారాయణ మృతికి సంతాపం తెలిపారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలపుతూ వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు.