ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వద్దకు వెళ్లిన టిడిపి నాయకుడిని ఇంత దారుణంగా హత్య చేయడం సిఎం జగన్మోహన్ రెడ్డికి సిగ్గుచేటని మాజీ సీఎం, టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప జిల్లా పొద్దుటూరులో టిడిపి నాయకుడు నందం సుబ్బయ్య హత్యను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. చేనేత కుటుంబానికి చెందిన టిడిపి నాయకుడు సుబ్బయ్య హత్య కిరాతక చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల నాయకులను భౌతికంగా మట్టుపెట్టడమే లక్ష్యంగా వైసిపి పెట్టుకుందని...
వైసిపి ఎమ్మెల్యే అవినీతిని తన ప్రెస్ మీట్ల ద్వారా బట్టబయలు చేశాడన్న అక్కసుతోనే సుబ్బయ్యను కిరాతకంగా హత్య చేశారని ఆరోపించారు.
''ఇసుక అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్ లో ఎమ్మెల్యే పాత్రను, ఆయన బావమరిది పాత్రను బహిర్గతం చేశాడన్న కక్షతో సుబ్బయ్యను హతమార్చడం కిరాతక చర్య. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వద్దకు వెళ్లిన టిడిపి నాయకుడిని ఇంత దారుణంగా హత్య చేయడం సిఎం జగన్మోహన్ రెడ్డికి సిగ్గుచేటు. ఇళ్ల పట్టాల్లో అవినీతిని బైటపెట్టాడని, వైసిపి కుంభకోణాలను ప్రశ్నించాడని, నిరసనలు తెలిపాడని సుబ్బయ్యను హతమార్చడం రాక్షస చర్య'' అని మండిపడ్డారు.
''జగన్మోహన్ రెడ్డి సిఎం అయ్యాక రాష్ట్రంలో ఎవరి ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది. ఎప్పుడు ఎవరిని హత్య చేస్తారో, ఏ ఆడబిడ్డపై అత్యాచారానికి పాల్పడతారో, ఎవరి ఇంటిపై దాడి చేస్తారో అని జనం భీతిల్లే పరిస్థితి దాపురించింది. జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రతిరోజూ, ప్రతి పూటా హత్యలు, మానభంగాలు, హింసా విధ్వంసాలు నిత్యకృత్యం అయ్యాయి'' అని ఆరోపించారు.
''వైసిపి ఎమ్మెల్యేల అవినీతి కుంభకోణాలను బైటపెట్టిన వాళ్ల ప్రాణాలు తీయడం హేయం. రూల్ ఆఫ్ లా రాష్ట్రంలో ఏ స్థాయికి దిగజారిందో, ప్రజాస్వామ్యం ఎలా అపహాస్యం పాలవుతుందో సుబ్బయ్య హత్యోదంతమే ప్రత్యక్ష సాక్ష్యం. గత 19నెలల్లో రాష్ట్రంలో అనేకమంది టిడిపి నాయకులను, కార్యకర్తలను బలిగొన్నారు. క్రిమినల్స్ డెన్ గా రాష్ట్రాన్ని మార్చారు. మాఫియా మూకల కిరాతక చర్యలకు అంతం లేకుండా పోయింది'' అన్నారు.
''వైసిపి అధికారంలోకి వచ్చాక నేరగాళ్లెంత పేట్రేగిపోతున్నారో, శాంతిభద్రతలు ఏవిధంగా అడుగంటాయో సుబ్బయ్య హత్య అద్దం పడుతోంది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. దీనికి సిఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. హంతకులను కఠినంగా శిక్షించాలి. సుబ్బయ్య కుటుంబానికి న్యాయం చేయాలి'' అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 29, 2020, 12:57 PM IST