హైదరాబాద్: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చెలరేగిన ఎన్టీఆర్ ఘాట్ అలంకరణ వివాదంపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద అలంకరణ ప్రతీ ఏడాది తెలంగాణ ప్రభుత్వమే చేస్తుందని స్పష్టం చేశారు. 

ఎన్టీఆర్ ఘాట్ అలంకరణకు సంబంధించి తెలంగాణ టీడీపీ నేతలు ప్రభుత్వానికి లేఖ కూడా రాశారని గుర్తు చేశారు. ఈ సంవత్సరం కూడా తెలంగాణ ప్రభుత్వం అలంకరిస్తుందని తాను భావించినట్లు తెలిపారు. 

ఇకపోతే ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించిన నేతలు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. అధికారం పోతే ఎన్టీఆర్ ను పట్టించుకోరా అంటూ నిలదీశారు. ముఖ్యంగా లక్ష్మీపార్వతి చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నేతలకు ఫోన్ చేసిన చంద్రబాబు అసలు కారణం తెలుసుకున్నారు. 

అలంకరణపై ప్రభుత్వానికి లేఖ కూడా రాశామని అయితే అలంకరణ చేయలేదని వారు చంద్రబాబుకు స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే పార్టీ ద్వారా అయినా ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఇలాంటివి పునరావృతం కాకూడదని నేతలకు చంద్రబాబు నాయుడు సూచించినట్లు తెలుస్తోంది. 

చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి. ఇకపోతే నటుడు జూ.ఎన్టీఆర్ సైతం ఎన్టీఆర్ ఘాట్ అలంకరణపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనీసం పూలు కూడా చల్లకపోవడంతో అప్పటికప్పుడు పూలు రప్పించి నివాళులర్పించారు. ఇకపై ప్రతీ ఏడాది ఎన్టీఆర్ ఘాట్ అలంకరణ ఏర్పాట్లు తానే చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.